అధికారం రుచి తెలిసిన రాజకీయ కుటుంబాలు ఎడాపెడా వారసులను రంగంలోకి దించిన, దింపుతోన్న వైనాలు ప్రజలకు కొత్తకాదు. కేవలం ఫలానా నేతకు వారసులనే వైల్డ్ కార్డు మాత్రమే కాకుండా అంతోఇంతో విషయం ఉంటేనే జనం సైతం ఆదరిస్తున్నారు. నిజానికి వారసత్వ రాజకీయాల్లో విజయం సాధించిన కుటుంబాలు కొన్ని మాత్రమే. అయితే, గతంలో కంటే ఇప్పుడు కొడుకులు, కూతుళ్లను సక్సెసర్లుగా తయారుచేస్తోన్న పొలిటీషియన్ల సంఖ్య పెరిగింది. ఈ ఒరవడి గ్రామీణ జిల్లాల్లో కంటే సిటీలు, మెట్రో నగరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా గ్రేటర్ ను ఆనుకుని ఉండే పలు రెండు మూడు జిల్లాలను కలుపుకొంటే కనీసం పాతికమంది రాజకీయ వారసుల పేర్లను ఈజీగా చెప్పొచ్చు. వాళ్లలో కొందరు ఇప్పటికే టికెట్లు పొంది ఫెయిలైపోగా, ఇంకొందరు తొలి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మారుతున్న పరిణామాల్లో ‘మేరా నంబర్ ఆయేగా’అని ఆశాభావంతో ఉన్నారు. రాజకీయ వారసత్వాలకు సంబంధించి తాజాగా బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి హాట్ టాపిక్ గా మారారు.
తెలంగాణ బీజేపీ సీనియర్మోస్ట్ లీడర్, మల్టిపుల్ టైమ్ ఎంపీ, కేంద్ర మంత్రిగానూ పనిచేసి, రాష్ట్రంలో ఏకైక అజాతశతృవుగానూ పేరుపొందిన బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగుతున్నారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గానూ వ్యవహరించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణపై ఫోకస్ పెంచిన బీజేపీ ఇక్కడి సీనియర్ నేతలు పలువురికి జాతీయ స్థాయిలో విస్తృతమైన అవకాశాలు కల్పిస్తూ తద్వారా ఏర్పడే గ్యాప్ లో కొత్త నాయకత్వాన్ని నింపుతున్నది. దత్తన్నకు గవర్నర్ గిరీ, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి, తాజాగా డాక్టర్ కె.లక్ష్మణ్ కు యూపీ నుంచి రాజ్యసభ సీటు దక్కడంతో వారు ఓ మెట్టు పైకెళ్లగా, స్థానికంగా ఏర్పడిన గ్యాప్ ను కొత్తతరం భర్తీ చేస్తున్నది.
అందరికీ ఆమోదయోగ్యుడైన దత్తన్న కూతురు బండారు విజయలక్ష్మి గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుండగా, డాక్టర్ లక్ష్మణ్ రూపంలో ఏర్పడిన గ్యాప్ ఆమెకు కలిసిరానుందని పార్టీలో చర్చ జరుగుతోంది. దశాబ్దాల ప్రస్థానంలో కె.లక్షణ్ కు ముషీరాబాద్ నియోజకవర్గం కేరాఫ్ గా మారిపోగా, ఇప్పుడాయన ఎంపీ కావడంతో సొంత స్థానానికి దూరం కావాల్సి పరిస్థితి. రాబోయేరోజుల్లో లక్ష్మణ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా ఆయన ఢిల్లీలో బీజీ అయిపోతే, ముషీరాబాద్ నియోజకవర్గంలో తాను పాగా వేసేందుకు దత్తన్న కూతురు విజయలక్ష్మి ఇప్పటికే ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
డాక్టర్ కె. లక్ష్మణ్ కు రాజ్యసభ ఎలివేషన్ ద్వారా ముషీరాబాద్ స్థానంలో బండారు విజయలక్ష్మికి దాదాపు లైన్ క్లియర్ అయిందని, తదుపరి ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆమెకే టికెట్ దక్కుతుందని నేతలు అనుకుంటున్నారు. ముషీరాబాద్‌లో బీజేపీకి పెద్ద దిక్కు, ఏడుసార్లు పోటీ చేసిన లక్ష్మణ్.. రాబోయే ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంతా భావించడంతో విజయలక్ష్మి.. ముషీరాబాద్‌తో పాటు అంబర్‌పేట, సనత్ నగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే, లక్ష్మణ్ రాజ్యసభకు వెళ్తుండడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి అనుచర వర్గంలో నూతనోత్తేజం వెల్లివిరిస్తోంది. కాగా, లక్ష్మణ్‌కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఖరారు చేయడంలో దత్తాత్రేయ కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. దత్తన్న ఏటేటా దసరాకు తలపెట్టే అలైబలై కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా విజయలక్షే నిర్వహిస్తున్నారు.
దత్తన్న కూతురు విజయలక్ష్మి వ్యవహారం ఇట్లుంటే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని పార్టీల నేతలు తమ వారసులను బరిలోకి దింపుతున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి(గతంలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీచేశారు) ఈసారి రాజేంద్రనగర్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం యత్నిస్తున్నారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయికిరణ్ యాదవ్ (స్కై) గతంలో సికింద్రాబాద్ లోక్ సభకు పోటీచేసి ఓడగా ఈసారి కూడా ఆ సీటుపైనే ఫోకస్ పెట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తన కూతురైన మాజీ కార్పొరేటర్ లాస్య నందితకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు.
ముషీరాబాద్ లో ముఠా గోపాల్ కుటుంబం, నాయిని నర్సింహారెడ్డి కుటుంబం, కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ యాదవ్ కొడుకు అనిల్ యాదవ్, సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ (పజ్జన్న) కొడుకు రామేశ్వర్ గౌడ్, గోషామహల్ లో కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్, మాల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు రోహిత్, మాజీ ఎమ్మెల్యే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కొడుకు వీరేశ్ కుత్బుల్లాపూర్ లో, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ మహేశ్వరం ఎమ్మెల్యే స్థానంలో, శేరిలింగంపల్లి లో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి కొడుకు రవి కుమార్.. ఇలా డజనుకుపైగా సీట్లలో వారసుల హోరు కనిపిస్తోంది. వీళ్లలో కొందరు ఇప్పటికే తొలి ప్రయత్నంలో పరాజయం పొందగా, మరోసారి అవకాశం దక్కుతుందా? కొత్త వాళ్లలో ఎంతమందికి టికెట్లు దక్కుతాయి? పార్టీలు టికెట్లిచ్చినా ప్రజలు ఆశీర్వదిస్తారా? అనేది కాలమే చెబుతుంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandaru dattatreya, Bjp, Congress, Hyderabad, Trs