Modi| Kcr: బీజేపీ సభ తరువాత సీఎం కేసీఆర్ డైలమాలో పడిపోయారని... తనను మోదీ టార్గెట్ చేస్తే.. ఆయనకు కౌంటర్ ఇవ్వాలని అనుకున్న కేసీఆర్.. ఆ పని చేయలేకపోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఆయన వ్యూహాలను తట్టుకోలేక రాజకీయ ప్రత్యర్థులు బోల్తా పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తనదైన వ్యూహాలతోనే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ను డైలమాలో పడేసేలా బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్రమోదీ వ్యవహరించారనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు సాగుతోంది. ఈ రాజకీయ పోరులో రెండు పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ.. బహిరంగ సభ ద్వారా టీఆర్ఎస్, కేసీఆర్ను టార్గెట్ చేస్తారని అంతా భావించారు. టీఆర్ఎస్ కూడా ఇదే ఊహించింది.
కానీ ప్రధాని మోదీ వారి అంచనాలకు భిన్నంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడా టీఆర్ఎస్, కేసీఆర్ పేరు కూడా ఎత్తలేదు ప్రధాని మోదీ. నిజానికి ప్రధాని నరేంద్రమోదీ కేసీఆర్ లేదా బీజేపీని టార్గెట్ చేస్తే ఆయనకు కౌంటర్ ఇవ్వాలని టీఆర్ఎస్ భావించింది. ఇందుకోసం స్వయంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ప్రధాని మోదీ చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు ప్రధాని మోదీకి ఇరుకునపెట్టేందుకు సంధించాల్సిన ప్రశ్నలను కూడా టీఆర్ఎస్ నాయకత్వం రెడీ చేసుకున్నట్టు సమాచారం. కానీ ప్రధాని నరేంద్రమోదీ మాత్రం తన ప్రసంగంలో కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ఎత్తలేదు.
సభలో మాట్లాడిన అమిత్ షా సహా ఇతర నేతలు కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు చేసినా.. ప్రధాని మోదీ మాత్రం ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించారు. దేశం ఏ విధంగా ముందుకు సాగుతోంది ? తెలంగాణలో బీజేపీ బలం ఏ విధంగా పెరుగుతోందనే దానిపైనే ప్రధాని మోదీ కామెంట్ చేశారు. బీజేపీ సభ తరువాత సీఎం కేసీఆర్ డైలమాలో పడిపోయారని... తనను మోదీ టార్గెట్ చేస్తే.. ఆయనకు కౌంటర్ ఇవ్వాలని అనుకున్న కేసీఆర్.. ఆ పని చేయలేకపోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ విషయంలో కేసీఆర్కు అవకాశంగా ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని మోదీ ఈ రకంగా మాట్లాడారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ ఏ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతారనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. తనను విమర్శించని ప్రధాని మోదీని టార్గెట్ చేసే విషయంలో కేసీఆర్ ఎలాంటి అజెండాను తెరపైకి తీసుకొస్తారో అనే దానిపై కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొత్తానికి తనదైన వ్యూహంతో ప్రధాని మోదీ కేసీఆర్ను కన్ఫ్యూజ్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.