తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడటం మాట అటుంచితే.. ఆ పార్టీ మరింత బలహీనపడుతున్న పరిస్థితులు కళ్లముందు కనిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్ కోల్పోయినా.. టీఆర్ఎస్, బీజేపీలతో పోరాడి 20 వేలకు పైగా ఓట్లు సాధించుకున్నామని పార్టీ నేతలు సంతృప్తి చెందుతున్నారు. మునుగోడు(Munugodu) ఉప ఎన్నిక తరువాత ఆ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుందనే అంశం తెరపైకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై నేతలెవరూ పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ఈసారి హుజూరాబాద్ తరహా రచ్చ ఉండదని అంతా అనుకున్నారు. దీనికితోడు మునుగోడు ఉప ఎన్నిక పూర్తయిన తరువాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సైలెంట్ అయిపోవడంతో.. ఆయన ద్వారా కూడా పార్టీకి ఇబ్బంది ఉండదని భావించారు.
కానీ కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy).. మరోసారి రేవంత్ రెడ్డిని(Revanth Reddy) టార్గెట్ చేస్తూ వాయిస్ పెంచడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు బాధ్యత పూర్తిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిదే అని కామెంట్ చేశారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్‌కే పడుతుందని అనుకోవద్దని అన్నారు. గత 4 నెలల నుంచి పార్టీ సమావేశాలు లేవని.. దీనికి పీసీసీ ఆర్గనైజేషన్ ఇంఛార్జ్ మహేశ్ కుమార్ గౌడ్‌దే బాధ్యత అని ఆరోపించారు. పార్టీ సమావేశంలో జూమ్‌లో నిర్వహించడాన్ని జగ్గారెడ్డి తప్పుబట్టారు.
ఇదేమీ కంపెనీ కాదని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడం పార్టీకి నష్టమే అని అభిప్రాయపడ్డారు. అయితే ఉన్నట్టుండి జగ్గారెడ్డి మళ్లీ తన అసంతృప్తి గళం వినిపించడంతో.. కాంగ్రెస్‌లో మళ్లీ పంచాయతీ మొదలైనట్టే కనిపిస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. సమస్యలపై పోరాటంతో ప్రజల్లోకి వెళదామని రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తుంటే.. ముందుగా రాష్ట్రంలో పార్టీని ప్రక్షాళన చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేస్తుండటంతో.. ఆయన మరోసారి టీపీసీసీ చీఫ్ మార్పు అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారనే వాదన జోరందుకుంది.
TRS MLAs Poaching Case: అందుకే ఫ్లైట్ టికెట్ బుక్ చేశా..ఈడీ విచారణలో బండి సంజయ్ అనుచరుడు వివరణ
Chiranjeevi: మా తమ్ముడు సీఎం అవడం ఖాయం .. పవన్ కల్యాణ్ పొలిటికల్ సైలెంట్‌ని బ్రేక్ చేసిన చిరంజీవి
జగ్గారెడ్డి చేస్తున్న వాదనను కాంగ్రెస్ హైకమాండ్ ఏ మేరకు పట్టించుకుంటుందనే విషయం తెలియకపోయినా.. కొంతకాలం నుంచి సైలెంట్‌గా ఉంటూ వచ్చిన జగ్గారెడ్డి మళ్లీ వాయిస్ పెంచడంతో.. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంతగా నష్టం చేస్తుందో అనే చర్చ మరోసారి మొదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagga Reddy, Telangana