కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఐక్యత అన్నది అంత సులువుకాదు. ఎవరెన్ని చెప్పినా.. హైకమాండ్ ఎన్ని హెచ్చరికలు చేసినా.. నేతలు మాత్రం ఈ విషయంలో ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన నవసంకల్ప్ సమావేశం కూడా ఆ పార్టీలో విభేదాలను స్పష్టంగా బయటపెట్టిందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చింతన్ శివిర్ నిర్వహించినట్టుగానే తెలంగాణలో(Telangana) కూడా నవసంకల్ప్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు భావించారు. ఈ విషయంలో ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చొరవ తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) విదేశాల్లో ఉన్న సమయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిజానికి ఇప్పటికప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయాలన్నంత తొందర ఏముందని కొందరు నేతలు చెబుతుంటే.. రేవంత్ రెడ్డితో పాటు ఒకరిద్దరు నేతలు అందుబాటులో లేకపోతే సమావేశాలు నిర్వహించకూడదా ? అని మరికొందరు నేతలు వాదిస్తున్నారు. అంతేకాదు ఈ సమావేశానికి హాజరైన నేతల్లో ఎక్కువమంది రేవంత్ రెడ్డి అంటే గిట్టనివాళ్లే అనే చర్చ కూడా తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేతలంతా కావాలనే రేవంత్ రెడ్డి అందుబాటులో లేని సమయం చూసి ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేశారనే చర్చ కొంతకాలంగా సాగుతోంది.
వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేని వారి కోసం సమావేశాలు వాయిదా వేయలేమని భట్టి విక్రమార్క చెప్పడం.. రేవంత్ రెడ్డి వర్గానికి ఆగ్రహం తెప్పించిందనే వాదన ఉంది. టీపీసీసీ చీఫ్ స్థాయి వ్యక్తి కోసం కీలకమైన సమావేశాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోలేరా ? అనే కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమావేశాల్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోయినా.. ఆయన లేకపోయినా తాము కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లగలమనే సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే కొందరు నేతలు ఈ రకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ రకమైన మేథోమథన సమావేశాలు పెట్టుకోవడం వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేకపోయినా.. ఇలాంటి కార్యక్రమాలు పార్టీ బలోపేతం కోసం ఉండేలా తప్ప.. పార్టీలో విభేదాలు ఉన్నాయని చాటిచెప్పేందుకు కాదని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన నవసంకల్ప్ సమావేశం పార్టీలో ఎలాంటి కొత్త ఇబ్బందులకు తెరతీస్తుందో అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhatti Vikramarka, Congress, Revanth Reddy, Telangana