హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో (Munugode Bypoll) టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై (Komatireddy Rajagopal Reddy) ఆయన పది వేలకు పైగా మెజార్టీ సాధించి మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురవేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ (TRS) శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ ఎన్నికల్లో గెలిచి రానున్న జనరల్ ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చేది తామేనన్న సంకేతాలు ఇవ్వాలని ఉవ్విళ్లూరింది కమల దళం. కానీ ఊహించని ఈ ఓటమి ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నింపింది. అయితే.. బీజేపీ, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ 5 తప్పులే ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగా మారాయి. అవేంటో చూద్దాం..
1. 18 వేల కోట్ల ప్రచారానికి సరైన కౌంటర్ ఏదీ?
రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలు ప్రారంభమైన నాటి నుంచి కూడా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందించే కాంట్రాక్ట్ కు ఆశపడే పార్టీ మారుతున్నారని టీఆర్ఎస్ ప్రచారం చేసింది. అయితే.. రాజగోపాల్ రెడ్డి తో పాటు బీజేపీ నేతలు ఈ ప్రచారానికి సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారు. పైగా.. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ కుమారుడికి చెందిన కంపెనీకి రూ.18 వేల కాంట్రాక్ట్ ఆరు నెలల క్రితం వచ్చిందని రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఒప్పుకోవడం.. టీఆర్ఎస్ ఆరోపణలకు ఆధారంగా నిలిచింది.
ఇంకా తాను బీజేపీతో 3 ఏళ్లుగా టచ్ లో ఉన్నానని అదే ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రకటన పెద్ద మైనస్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ లను టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాయి. కొన్ని చోట్ల ఇందుకు సంబంధించిన పోస్టర్లను సైతం అంటించి మరీ ప్రచారం చేశారు కోమటిరెడ్డి ప్రత్యర్థులు.
2. అన్న వెంకట్ రెడ్డి వ్యవహారం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా.. ఆయన అన్న వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటించారు. కానీ, వివిధ సాకులు చెప్పి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారానికి రాలేదు. ఇంకా తమ్ముడికి ఓటు వేయాలంటూ ఆయన చేసిన ఓ ఫోన్ కాల్ బయటికి రావడం బ్రదర్స్ విశ్వసనీయతను దెబ్బకొట్టింది. ఈ కారణాలు చూపుతూ.. కోవర్ట్ బ్రదర్స్ అంటూ ప్రత్యర్థులు చేసిన ప్రచారం రాజగోపాల్ రెడ్డికి సైతం మైనస్ గా మారింది.
3. కాంగ్రెస్ క్యాడర్ పూర్తిగా రాకపోవడం..
తాను బీజేపీలో చేరే సమయంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ అంతా వెంట వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంచనా వేసుకున్నారు. అయితే.. కాంగ్రెస్ నాయకులందరినీ తన వెంట తీసుకెళ్లడంలో ఆయన ఆశించినంతగా సక్సెస్ కాలేదు. పల్లె రవి లాంటి ప్రభావం చూపే స్థాయి కలిగిన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లోకి వెళ్లి ఆ పార్టీ బలాన్ని మరింతగా పెంచారు. అదే సమయంలో.. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ మోసం చేశారన్న బలమైన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లింది కాంగ్రెస్.
దీంతో సాంప్రదాయంగా వస్తున్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కొంత ఆ పార్టీతోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోటీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు 24 వేల ఓట్లను సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 15 వేల ఓట్లను బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తమ వైపునకు తిప్పుకోగలిగితే విజయం సాధించే అవకాశం ఉండేది.
4. రాజీనామా ఎందుకు?
తాను ఎందుకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందోనన్న విషయాన్ని ప్రజలకు వివరించడంలో రాజగోపాల్ రెడ్డి పెద్దగా సక్సెస్ కాలేదు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని.. ఆయన ఇచ్చిన వివరణకు ఓటర్లు పెద్దగా కన్విన్స్ కాలేదు. ప్రతిపక్షం నుంచి మళ్లీ ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తే అభివృద్ధి ఎలా సాధ్యమన్న ప్రశ్నలు రావడమే ఇందుకు కారణం. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో సైతం పెద్దగా ప్రభావం చూపలేదు.
5. చివరి రోజు టైం వేస్ట్..
ప్రచారం ముగిసే సమయంలో నియోజకవర్గంలో భారీ సభను నిర్వహించాలని బీజేపీ భావించింది. ఆ సభకు పార్టీ అగ్రనేతలను తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. అగ్రనేతలెవరూ నియోజవర్గానికి రాలేదు. దీంతో సభ నిర్వహించలేదు. బీజేపీ ఓడిపోతుందని గ్రహించే.. అగ్రనేతలెవరూ ప్రచారానికి రావడం లేదని వచ్చిన వార్తలు ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహనికి గురి చేశాయి. ఇంకా.. ప్రచారం చివరి రోజు పలివెల గ్రామంలో జరిగిన ఘర్షణతో రాష్ట్ర నాయకత్వం మొత్తం అక్కడే దృష్టి కేంద్రీకరించి విలువైన సమయాన్నంతా వృథా చేసుకుంది. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రతీ మండల కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించి ఆఖరి రోజు తన బలాన్ని చాటింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Komatireddy rajagopal reddy, Munugode Bypoll, Munugodu By Election, Telangana Politics