Home /News /telangana /

TS POLITICS MLC KAVITA CALLED ON THE TRS LEADERS TO SAY JAI HANUMAN IF THEY SAY JAI SHRIRAM KNR PRV

MLC Kavita: వాళ్లు జై శ్రీరామ్​.. అంటే మనం జై హనుమాన్​ అనాలి.. టీఆర్​ఎస్​ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత పిలుపు

ఎమ్మెల్సీ కవిత (ఫైల్)

ఎమ్మెల్సీ కవిత (ఫైల్)

బీజేపీ ప్రభుత్వం హామీలు ఆకాశంలో, వాటి అమలు పాతాళంలో ఉందని తీవ్రంగా  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లిలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కవిత పాల్గొన్నారు.

  బీజేపీ ప్రభుత్వం హామీలు ఆకాశంలో, వాటి అమలు పాతాళంలో ఉందని తీవ్రంగా  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavita) విమర్శించారు. కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లిలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలిపిన పార్టీగా టీఆర్ఎస్ కార్యకర్తలు (TRS Leaders) సగర్వంగా ప్రతిపక్షాలకు సమాధానం చేప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ హయాంలో జీడీపీ నేల మీద, నిత్యావసర ధరలు ఆకాశంలో ఉన్నాయన్న ఎమ్మెల్సీ కవిత, మోదీ (Modi) హైతో ముష్కిల్ హై అంటూ మండిపడ్డారు. దేవుడు పేరుతో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని, వాళ్లు జై శ్రీరాం (Jai Shriram) అంటే మనం జై హనుమాన్ (Jai hanuman) అనాలని కవిత పిలుపునిచ్చారు.

  అవినీతి లేకుండా పథకాల అమలు..

  రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని చెప్పారు. అవినీతి రహితంగా సీఎం కేసీఆర్‌ (CM KCR) పాలన అందిస్తున్నారని కవిత తెలిపారు. ఆడబిడ్డలకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. దళితబంధు పథకం దేశంలో ఎక్కడా లేదని ఎమ్మెల్సీ వెల్లడించారు. టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై ప్రతి గ్రామంలో చర్చపెట్టాలని సూచించారు. దేశంలో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని కవిత స్పష్టం చేశారు.

  స్థానికత జీవోను పక్కనపెట్టింది..

  తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసమని, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామని వెల్లడించారు. స్థానికతకు సంబంధించిన జీవో రెండేండ్ల పాటు కేంద్రం పెండింగ్‌లో పెట్టినా ఓపిక పట్టామని చెప్పారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావాలని సూచించారు. గతంలో 7 వేల మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం 281 బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేశామని కవిత అన్నారు. రూ.1300 కోట్లతో లక్షా 32 వేల వెనుకబడిన తరగతుల విద్యార్థులను చదివిస్తున్నామని వెల్లడించారు. 96 లక్షల విద్యార్థులకు రూ.8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని తెలిపారు.

  ప్రతిపక్షాల మ్యాచ్ ఫిక్సింగ్

  ఎంపీ అర్వింద్‌ (MP Aravind) అబద్ధాలకు ప్రతిరూపమని కవిత (kavita) విమర్శించారు. పనిచేయ చేతగాదు కానీ అబద్ధాలు చెప్పుకుంటారని ఆరోపించారు . అబద్ధం వెళ్లి అద్దంలో చూసుకుంటే అరవింద్‌ కనిపించాడంటా అని కవిత ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో గెలిచినవాళ్లకు మర్యాద ఇవ్వాలని.. అందుకే అరవింద్‌కు మూడేండ్లు అవకాశం ఇచ్చామన్నారు. అయినా రైతులకు చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. టీఆర్‌ఎస్‌ చేసిన పనులను కూడా తామే చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని వెల్లడించారు.ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించరని కవిత ప్రశ్నించారు. పసుపు బోర్డు, ధరల పెరుగుదలపై ఎందుకు విమర్శించరని, ఇరు పార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందేమోనని కవిత సందేహం వ్యక్తంచేశారు.

  టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూపించండి..

  టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు, వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామన్న ఎమ్మెల్సీ కవిత, కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోట అన్నారు. కాంగ్రెసోళ్లు రైతు రచ్చబండ పేరుతో గ్రామాలకు వస్తే ప్రకృతివనాలు, డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు చూపించాలన్నారు. తెలంగాణకు రావాల్సిన బకాయిలపై పార్లమెంటులో మాట్లాడాలని రాహూల్‌ను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికలలో జగిత్యాలలో ఉన్న అన్ని నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

  కొండగట్టు లో హనుమాన్ చాలీసా పారాయణం

  కొండగట్టు అంజన్న సన్నిధిలో నిర్వహించిన 108 హనుమాన్ చాలీసా పారాయణంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్, టిఆర్ఎస్ నాయకులు దావా సురేష్ ,
  తెలంగాణ జాగృతి నాయకులు చరణ్ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Karimangar, Kavitha, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు