Home /News /telangana /

TS POLITICS MLA SITAKKA STRATEGY BEHIND TATI VENKATESHWARAO JOINING CONGRESS IN KHAMMAM DISTRICT SNR KMM

Khammam: మాజీ ఎమ్మెల్యే తాటి కాంగ్రెస్‌లో చేరికతో ఖమ్మం తెరాసలో ముసలం .. సీతక్క పొలిటికల్ స్కెచ్‌

(సీతక్క పొలిటికల్ స్కెచ్ )

(సీతక్క పొలిటికల్ స్కెచ్ )

Khammam: రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. సొంత పార్టీలోనే విరోధులు ఉండవచ్చు...ప్రత్యర్ది పార్టీలోని నేతలు మిత్రులుగా మారవచ్చు. ఖమ్మం రాజకీయాలు చూస్తుంటే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. టీఆర్ఎస్‌ నేత తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ పార్టీ కండువ కప్పుకోవడం వెనుక ఎమ్మెల్యే సీతక్క వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...
  (G.SrinivasReddy,News18,Khammam)
  'నేను 1981లోనే సర్పంచ్‌గా గెలిచాను. కేటీఆర్‌ సర్పంచ్‌గా గెలవలేదు. నేను సీనియర్‌ను. నన్ను ఓడించడానికి తెరాసలోనే ఒక వర్గం పనిచేసింది. నా రాజకీయ ఎదుగుదల ఓర్వలేక తొక్కేస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు మొరపెట్టుకున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. అందుకే నేను రాజీనామా చేస్తున్నాను. కానీ ఖచ్చితంగా నేను అశ్వారావుపేట(Aswaraopeta)లోనే పోటీచేస్తా.. ఏ పార్టీ అనేది ఇప్పుడే చెప్పనంటూ.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు (Tati Venkateshwarlu) కుండబద్ధలు కొట్టినట్టు తేల్చేశారు. జనంలో ఉన్న నాయకులకు టికెట్‌ రాదంటూ ఇప్పటి నుంచే ప్రచారం చేయడమేంటంటూ..' తాటి ధ్వజమెత్తారు. ఉమ్మడి ఖమ్మం(Khammam)జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైన తాటి వ్యవహారంలో అసలేం జరిగింది..? ఆయన ఎందుకు పార్టీకి దూరమయ్యారు..? ఆయన వల్ల తెరాసకు వచ్చిన నష్టమేంటి..? తెరాసలో తీవ్ర దుమారాన్ని రేపిన మాజీ ఎమ్మెల్యే తాటి వ్యవహారంపై 'న్యూస్‌18 తెలుగు' స్పెషల్ స్టోరీ.

  ముసలం మొదలు..
  ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాసలో ముసలం పుట్టింది. అవును ఇప్పటిదాకా ఎంతటి అసంతృప్తులైనా, గుండెల్లో ఎంతటి బాధ గూడుకట్టుకుని ఉన్నా.. ఎన్నిసార్లు నిర్లక్ష్యానికి గురైనా.. పార్టీ అధిష్టానం అస్సలు పట్టించుకోకుండా ఉన్నా.. ఏ నాయకుడు నోరు తెరవలేదు. ఉద్దండులుగా గుర్తింపు ఉన్న నేతలు సైతం పంటిబిగువున  భరిస్తూ వస్తున్నారు. శరీరం లోపల ఉన్న వ్యాధి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో తన ప్రభావాన్ని చూపినట్టు ఇప్పుడు తెరాసలో లోలోపల గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి ఇప్పుడు ఇలా తాటి రూపంలో బట్టబయలైంది. నిజానికి తన రాజీనామా సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి చేసిన వ్యాఖ్యలు, విమర్శలు దాదాపు చాలామంది నేతల మనసుల్లో ఉన్నవేనన్నది తెరాస నేతల మనసులోని మాటే. కానీ వాటిని కక్కే సందర్భం, అవకాశం వచ్చినపుడు అన్నీ తన్నుకొచ్చేస్తాయంటున్నదీ వారే.  ఇప్పటికి తాటి వంతు.. 
  మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెరాసకు రాజీనామా చేశారు. ఆనక వెంటనే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. ఇలా వివిధ సందర్భాల్లో తాటి చేసిన విమర్శలు, వ్యాఖ్యలు పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేలా, థాట్‌ ప్రొవోకింగ్‌గా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. క్షేత్రస్థాయిలో కార్యకర్తగా పనిచేసి 1981లోనే సర్పంచిగా గెలిచిన తాటి తన రాజకీయ ప్రస్థానంలో అనేక మంది రాజకీయ ఉద్దండులతో కలసి పనిచేశారు. సీపీఐ, తెదేపా, వైసీపీ, తెరాసలలో పనిచేసి.. తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. ఈయన కాంగ్రెస్‌లో చేరికకు ఎమ్మెల్యే సీతక్క ప్రోద్బలం, ప్రోత్సాహం ఉందంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. ఇద్దరూ ఆదివాసీ వర్గానికే చెందిన వారు కావడం, ఈ మధ్య కాలంలో తాటి తన కుమార్తెను కోల్పోవడం, కొన్నేళ్ల క్రితం తన భార్యను సైతం కోల్పోవడం.. ఈ సందర్భాలలో పరామర్శకు వచ్చిన సీతక్క.. కాంగ్రెస్‌ లో చేరమని ప్రోత్సహించడం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి నమ్మకస్తురాలైన సీతక్క స్వయంగా పలుమార్లు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించడంతో తాటి మరో ఆలోచన చేయకుండా వెనువెంటనే చేరిపోయారు. సీపీఐలో ఉండగా ఆ పార్టీ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు సన్నిహితునిగా, తెదేపా, తెరాసల్లో ఉండగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ఎంపీ నామా నాగేశ్వరరావుకు, వైసీపీలో ఉండగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితునిగా మెలిగారు. 1999లో తొలిసారిగా తెదేపా తరపున గెలుపొందిన తాటి ఆనక పలుమార్లు ఓటమి చవిచూసి, 2014లో వైసీపీ తరపున గెలుపొందారు. ఆనక పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి తెరాసలో చేరారు. అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సన్నిహితంగా మెలగుతూ రాష్ట్ర స్థాయి కార్పోరేషన్‌కు ఛైర్మన్‌గా పనచేశారు. మళ్లీ 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తన ఓటమికి పార్టీలోని నేతలు సరిగా సహకరించకపోవడమే కారణంగా తాజాగా  తాటి విమర్శలు చేశారు. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సహా ఎవరినీ ఉపేక్షించకుండా విమర్శలు ఎక్కుపెట్టారు.

  ఇది చదవండి: తనను చదివించమని మంత్రినే కోరిన బాలుడు .. మినిస్టర్ రియాక్షన్‌ ఎలా ఉందో చూడండి


  ఇక వరుస పడుతుందా.. 
  'ద షిప్‌ ఈజ్ ష్రింకింగ్‌..' ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను దగ్గరి నుంచి పరిశీలిస్తున్న ఓ రాష్ట్ర స్థాయి నేత చేసిన వ్యాఖ్యలివి. అత్యంత ధృడంగా, పటిష్టంగా ఉందనుకున్న ఓడకు రంధ్రం పడిందని, ఈ విషయాన్ని గమనించినా, రిపేర్‌ చేయాల్సిన, చేయగలిగిన అధిష్టానం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది పార్టీ కార్యకర్తల ఆవేదనగా ఉంది. ప్రస్తుతం తెరాసకు ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురేసి నాయకులున్నారు. దీంతో మండల, గ్రామ స్థాయిలో వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ వచ్చినా మరొకరు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్‌ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నదన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. ఒక్క ఖమ్మం, భద్రాచలం నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాలైన వైరా, పాలేరు, కొత్తగూడెం, పినపాక, మధిర, ఇల్లెందు, అశ్వారావుపేట, సత్తుపల్లిల్లో బహునాయకత్వం తెరాసను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కింది స్థాయిలోని మండల, గ్రామ స్థాయి నాయకులు సైతం వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది. దీంతో రాజకీయంగా బతికి ఉండాలంటే ఏదో ఒక నియోజకవర్గంలో, ఏదో ఒక పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఉందన్నది తెరాస నేతల మాటే. ఇది ఎటువైపు దారితీస్తుందో, ఎలాంటి ఫలితాలను రుచి చూపిస్తుందో వేచిచూడాల్సిందే.

  ఇది చదవండి : రైతులకు శుభవార్త.. రైతుబంధులో కొత్త లబ్ధిదారులకు అవకాశం.. కటాఫ్ తేదీ ఇదే..

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Khammam, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు