బీజేపీ(BJP)ఇచ్చిన షోకాజ్ నోటీసుపై గోషామహల్ ఎమ్మెల్యే(Goshamahal MLA) రాజాసింగ్(Rajasingh)పార్టీ క్రమశిక్షణ కమిటీకి లేఖ(Letter) రాశారు. తాను పార్టీ నిబంధనలను ఏనాడు ఉల్లంఘించలేదన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉంటానని పార్టీలో కొనసాగుతూ దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని లేఖ ద్వారా కోరారు రాజాసింగ్. కేవలం మునావర్ ఫారుఖీ(Munawar Faruqi)ని అనుకరించాను తప్ప ఏ మతాన్ని, వ్యక్తిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. పీడీ యాక్ట్(PD Act)పై జైలులో ఉన్న రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్(suspend)చేసింది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరడంతో తన వాదన వినిపిస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీకి లేఖ రాశారు. ఈ లేఖతో బీజేపీ నాయకత్వం రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్ వేటును తొలగిస్తుందో లేక కొనసాగిస్తుందో చూడాలి.
కుట్ర పూరితంగా కేసులు పెట్టారు..
మునావర్ ఫారుఖీ షో సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియోలపై బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. క్రమశిక్షణ ఉల్లంఘన కింద బీజేపీ హైకమాండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాజాసింగ్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఆగస్ట్ 23న షోకాజ్ నోటీసు జారీ చేసింది.గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చుకునేందుకు 15రోజులు గడువు ఇచ్చింది. అయితే దాదాపు నెల 15రోజుల తర్వాత రాజాసింగ్ బీజేపీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదన్న ఎమ్మెల్యే ..హిందు ధర్మం కోసం పోరాడుతున్నందుకే తనపై టీఆర్ఎస్ , ఎంఐఎం కలిసి కుట్రపూరితంగా కేసులు పెట్టాయని లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నానని..క్రమశిక్షణ కార్యకర్తగానే కొనసాగుతానని లేఖ ద్వారా సమాధానమిచ్చారు.
సేవ చేసుకునే అకాశమివ్వండి..
తాను ఏ మతాన్ని కించపరచలేదని కేవలం మునావర్ ఫారుఖీ అనుకరించి వీడియో చేశానని బదులిచ్చారు. మునావర్ ఫారుఖీ షో రోజు తనతో పాటు 5 వందల మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయాన్ని మరోసారి లేఖ ద్వారా బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే రాజాసింగ్. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని బీజేపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను ఎంఐఎం పార్టీ విధానాల్ని ప్రశ్నిస్తే వాటిని వక్రీకరించి తాను ముస్లింలను తిట్టానంటూ తనపై అక్రమ కేసులు పెట్టారని లేఖ ద్వారా పేర్కొన్నారు రాజాసింగ్.
వివరణపై హైకమాండ్ తగ్గేనా..
బీజేపీ హైకమాండ్ నోటీసుపై ఆలస్యంగా సమాధానం ఇచ్చిన రాజాసింగ్ ప్రజలకు,హిందూ మతానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని లేఖ ద్వారా పార్టీ క్రమశిక్షణ కమిటీని కోరారు. ఆగస్ట్ 25న రాజాసింగ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. వాస్తవంగా 15రోజుల్లో రాజాసింగ్ వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. కాని పీడీ యాక్ట్ తో జైలులో ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని రాజాసింగ్ భార్య ఉషాబాయ్ కోరడంతో ఇప్పుడు లేఖ ద్వారా తన వివరణ ఇచ్చుకున్నారు. క్రమశిక్షణ కమిటీకి రాజాసింగ్ పంపిన లేఖపై బీజేపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raja Singh, Telangana Politics