Home /News /telangana /

TS POLITICS MINISTER PUWADA AJAY KUMAR STAGED A MASSIVE RALLY WITH HIS PARTY WORKERS AND CHALLENGED POLITICAL OPPONENTS IN KHAMMAM KMM PRV

Politics: మంత్రి పువ్వాడ దూకుడు.. తిట్టించుకున్న చోటే ఆ పని చేసి రాజకీయ ప్రత్యర్థులకు సవాల్‌

పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్)

పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్)

మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ను అదృష్టవంతునిగా చెబుతున్నప్పటికీ.. తన గమనంలో.. నిత్యం తాను వేసే ప్రతి అడుగూ..ఎత్తుగడలోనూ.. ఒక స్పష్టత.. వ్యూహం తప్పనిసరిగా ఉంటాయన్నది దగ్గరిగా ఉండేవాళ్ల చెప్పేమాట.

  (G. Srinivasa Reddy, New18, Khammam)

  పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay kumar). రాష్ట్ర రవాణశాఖ మంత్రి (State Transport Minister). ఖమ్మం ఎమ్మెల్యే (Khammam MLA)గా నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తున్న నేత. వామపక్ష భావజాలంతో విద్యార్ధి దశలో పనిచేసినా.. తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ జాతీయ నేతగా ఎదిగినా.. తాను మాత్రం ఒక డిఫరెంట్‌ స్టైల్‌లో రాజకీయాలు చేస్తున్నట్టు పరిశీలకులు చెబుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే పుట్టిన వైసీపీతో రాజకీయ అరంగేట్రం చేసి జిల్లా కన్వీనర్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విసృతంగా పర్యటించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడం.. వైసీపీ ఏపీకి పరిమితం కావడంతో తాను 2014లో కాంగ్రెస్‌ టికెట్‌పై ఖమ్మం నుంచి పోటీ చేసి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్ల తెరాస (TRS) తీర్థం పుచ్చుకోవడం.. తదుపరి ఎన్నికల్లో తెరాస నుంచి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా గెలవడం.. ఆనక కమ్మ సామాజిక వర్గం నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఆ కోటాలో పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి దక్కడం వరుసగా చకచకా జరిగిపోయాయి.

  ప్రతి అడుగులోనూ ఒక స్పష్టత..

  ఒక రకంగా చెప్పాలంటే క్రియాశీల రాజకీయాల్లోకి  (Politics)అడుగుపెట్టిన ఏడాదిన్నరకే ఎమ్మెల్యే కావడం.. ఏడేళ్ల స్వల్పకాలవ్యవధిలోనే మంత్రి పదవిని దక్కించుకోవడం.. అందరూ బయటి నుంచి చూడ్డానికి రఫ్‌గా పోతున్నట్టు కనిపించినా.. లోతుగా పరిశీలిస్తే అజయ్‌కుమార్‌ ప్రతి చర్య వెనుక ఎంతో మథనం ఉంటుందంటారు సన్నిహితులు.

   ఇంటిపోరు కూడా..

  గత రెండు వారాలుగా వరుసగా చుట్టుముట్టిన ఆరోపణలతో మంత్రి అజయ్‌కుమార్‌ ఉక్కిరిబిక్కిరయ్యారని చెప్పొచ్చు. ఇక బయట పోరు ఇలా ఉంటే ఇంటిపోరు రోజరోజుకూ ఎగిసిపడుతుండటం.. సొంతపార్టీలోని నేతలే మంత్రిని ఓవైపు బహిరంగంగా వెనుకేసుకొస్తున్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా వ్యతిరేక శక్తులను రెచ్చగొడుతూ తమ అవకాశాలను మెట్లుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది కూడా వినిపిస్తోంది. దీనికితోడు తన సామాజికవర్గం తనకు అండగా నిలవాలంటూ వైరాలో కమ్మజన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ సభలో మంత్రి అజయ్‌కుమార్‌ పేర్కొనడంతో ఆయనపై రకరకాల కామెంట్లు, విసుర్లు సోషల్‌మీడియా (Social media) వేదికగా చక్కర్లు కొట్టాయి.

  పద్మవ్యూహంలో అభిమన్యునిలా..

  పద్మవ్యూహంలో అభిమన్యునిలా ఏకకాలంలో వీటన్నిటినీ ఎదుర్కొంటూనే, తన వాదనను, ఆరోపణలను తిప్పికొట్టారు అజయ్‌కుమార్‌. మతతత్వ పార్టీ బీజేపీ శవ రాజకీయాలు చేస్తున్నదంటూ ఖమ్మంలో లౌకిక, ప్రజాతంత్ర వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు దగ్గరి నుంచి తెరాసలోని అన్ని స్థాయుల్లోని నేతలు, ప్రజా ప్రతినిధులు దశల వారీగా చేసిన పోరాటం.. మంత్రి అజయ్‌పై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే కార్యక్రమం విజయవంతమైందనే చెప్పొచ్చు. తనను మంత్రి పదవి నుంచి తప్పించడానికి ఇంటా బయటా కుట్ర జరుగుతున్నదంటూ మంత్రి అజయ్‌కుమార్‌ స్వయంగా ఆరోపణలకు దిగారు. కమ్మ సామాజికవర్గం తనకు అండగా నిలవాల్సిన అవసరాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు, ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంపై తన సొంత సామాజికవర్గమే తనకు అండగా నిలవడంలేదన్న ఆవేదన అజయ్‌కుమార్‌ మాటల్లో వ్యక్తమైంది.

  నిజానికి ఆయన మొదటి నుంచి లౌకికవాదిగా, సామాజికవర్గాలకు అతీతంగానే వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తమ నేత ఎల్లప్పుడూ తనను తాను అజయ్‌ఖాన్‌గా చెప్పుకున్నారు తప్ప ఏనాడూ అజయ్‌చౌదరి అని చెప్పుకోలేదని.. అందుకే తామంతా ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నట్టు.. ఆయనపై ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆరోపణలు సంధించినా మేం తిప్పికొట్టగలమని ఆయనకు సన్నిహితుడైన ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ వేడిగా సాగినంత సేపు తాను సంయమనం పాటించి ఓ పదిరోజుల పాటు మౌనంగానే ఉన్న అజయ్‌కుమార్‌.. మేడే వేదికగా తన బలాన్ని, వాదనను చాటుకున్నారు.

  భారీ బల ప్రదర్శన..

  మార్కెట్‌యార్డు వద్ద నుంచి సాగిన కార్మిక ర్యాలీ (Huge Rally) త్రీటౌన్‌, గాంధీచౌక, రాజీవ్‌గంజ్‌, జూబ్లీపుర, మయూరిసెంటర్‌, పాతబస్టాండ్‌, జడ్పీసెంటర్‌, చెరువుబజార్‌, బోనకల్‌రోడ్‌, ముస్తాఫనగర్‌, చర్చికాంపౌండ్‌, ప్రకాష్‌నగర్‌ల మీదుగా సుదీర్ఘంగా సాగిన ర్యాలీలో పలుచోట్ల ప్రసంగించిన మంత్రి అజయ్‌కుమార్‌ .. ఖమ్మం అభివృద్ధిలో తన స్పీడ్ తగ్గదని.. మతతత్వ పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని పదేపదే చెప్పుకొచ్చారు. లౌకిక, ప్రజాతంత్ర ఉద్యమాలకు పుట్టినిల్లయిన ఖమ్మంలో బీజేపీ శవరాజకీయాలకు తావులేదని పేర్కొన్నారు. మొత్తంమీద తనపై వచ్చిన ఆరోపణలు, దూషణలకు ర్యాలీ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్‌ జవాబు చెప్పడం.. తన దూకుడు తగ్గదని చాటుకోవడంతో పాటు ఇంటా బయటా తన రాజకీయ ప్రత్యర్థులకు సవాల్‌ (Challenge) విసిరారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Khammam, Politics, Puvvada Ajay Kumar, Telangana Politics, TRS leaders

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు