ముందస్తు ఎన్నికలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister Ktr) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అందుకు సన్నద్ధం కావాలని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తుకు వస్తే తాము కూడా ముందస్తుకు వచ్చే విషయంపై ఆలోచిస్తామన్నారు. అప్పుడు అందరం కలిసి ముందస్తుకు వెళ్లొచ్చని మంత్రి కేటీఆర్ (Minister Ktr) అన్నారు. నేడు నిజామాబాద్ లో పర్యటించిన కేటీఆర్ (Minister Ktr) అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ (Minister Ktr) వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
కేంద్రంపై కేటీఆర్ ఫైర్..
ఈ క్రమంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేంద్రం అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోదీ సర్కార్ పెట్టబోయే ఈ చివరి బడ్జెట్ లో అయినా రాష్ట్ర విజ్ఞప్తులు పట్టించుకోవాలి. కేంద్రం తీరు ఆకాశానికి అప్పులు, పాతాళానికి రూపాయి అన్న చందంగా ఉంది. నిజామాబాద్ కు ఇకనైనా పసుపు బోర్డు ఇవ్వాలి. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి. రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందని కేటీఆర్ అన్నారు.
రైతులకు రూ.10 వేలు కేంద్రం కూడా ఇవ్వాలి..
రైతులకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం 10 వేలు అందిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎకరానికి 5 వేల చొప్పున పెట్టుబడి సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ చివరి బడ్జెట్ లో దానికి సంబంధించి నిధులు కేటాయించాలని మంత్రి అన్నారు. బీజేపీకి అభివృద్ధి చేయాలనీ ఉంటే కల్యాణలక్ష్మి, రైతుబంధు, విద్యాసంస్థల ఏర్పాటు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు సాయాన్ని పెంచి అందించాలని అన్నారు.
ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ పరోక్ష సంకేతం ఇచ్చారా?
కాగా కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళబోతున్నామని కేటీఆర్ పరోక్ష సంకేతాలు ఇచ్చారా అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చారు. ఈసారి అదే సెంటి మెంట్ ను రిపీట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.