తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటు పార్టీ కార్యక్రమాల్లో, అటు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో కేటీఆర్ పాల్గొనకపోవడం దీనికి కారణం. అయితే ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై కారణం ఏమై ఉంటుందనే చర్చ జోరుగా సాగుతుంది. గతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉండే కేటీఆర్ ఇప్పుడు కేవలం ట్విట్టర్ లో మాత్రమే విమర్శలు చేస్తున్నారు.
ఆ ఒక్కసారి తప్ప..
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో BRS ఆవిర్భావ సభకు మాత్రం కేటీఆర్ హాజరయ్యారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో KTR పాల్గొనలేదు. ఢిల్లీలోని బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా కుటుంబంతో కలిసి చేసిన చండీయాగం, రాజశ్యామల యాగం, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనకపోవడం గమనార్హం. అప్పట్లో కేటీఆర్ గైర్హాజరు అంశంపై తీవ్ర చర్చ జరిగింది.
ఏపీ నేతల చేరిక సమయంలో కూడా..
కాగా నిన్న ఏపీకి చెందిన పలువురు కీలక నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో మాజీ IAS తోట చంద్రశేఖర్ కు ఏపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. బీఆర్ఎస్ ఏర్పాటు తరువాతి వేరే రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు అప్పగించే సమయంలో కూడా కేటీఆర్ లేకపోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరిగింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభానికి, నిన్న ఏపీ నాయకుల చేరికల సమయంలో కేటీఆర్ లేకపోవడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.
కారణం అదేనా?
జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసీఆర్ మిగతా రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తెలంగాణ BRS అధ్యక్షుడిగా కేటీఆర్ ను నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన రాకపోగా మంత్రి కేటీఆర్ కూడా స్పందించలేదు. అయితే ఈ కారణంతోనే కేటీఆర్ బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతుంది. మరి కేసీఆర్ తెలంగాణ పదవులపై క్లారిటీ ఇచ్చే వరకు ఈ అంశం కొలిక్కి వచ్చేలా లేదు. అప్పటివరకు కేటీఆర్ సైలెంట్ గానే ఉంటారని చర్చ నడుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, CM KCR, KTR, Minister ktr, Telangana, Telangana Politics