TS POLITICS MINISTER KTR COUNTERED ON UNION HOME MINISTER AMIT SHAH REMARKS AND ACCUSED THE BJP OF TAKING COMMISSIONS PRV
KTR | Amit shah: బీజేపీని ఉతికారేసిన మంత్రి కేటీఆర్.. పదవులు అమ్ముకునే మీరు మా గురించి మాట్లాడుతారా?
కేటీఆర్, అమిత్ షా (ఫైల్)
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవులు అమ్ముకొని బతికే మీరు మా గురించి మాట్లాడటమా? అని ధ్వజమెత్తారు.
తెలంగాణలో రాజకీయ (Telangana politics) వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS)పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) ధ్వజమెత్తారు. నిన్న అమిత్ షా వచ్చి మాట్లాడిన మాటలు, చెప్పిన అబద్ధాలు చూస్తుంటే ఆయన పేరును కచ్చితంగా మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు. ఆయన అమిత్ షా కాదు.. అబద్ధాల బాద్ షా. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటంటే నిజం లేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. పనికిమాలిన మాటలు చెప్పిండు. తెలంగాణ (Telangana)కు పనికొచ్చే మాట చెప్పలేదు. తుక్కుగూడలో చెప్పిన తుక్కు డిక్లరేషన్.. తప్పుడు మాటలు నమ్మడానికి విశ్వసించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. 2014, 2018 ఎన్నికల్లో దారుణంగా ఓటమి చవిచూశారు. 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. క్షేత్రస్థాయిలో బలం లేదు. కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడి తప్పుదోవ పట్టించడం సరికాదు. వాట్సాప్ వర్సిటీలో తిరిగే విషయాలను వాస్తవాలుగా భ్రమింప చేసే ప్రయత్నం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పదవులు అమ్ముకొని బతికే మీరు మా గురించి మాట్లాడటమా? అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో (Karnataka) సీఎం పదవికి రూ. 2,500 కోట్లు అడిగినట్లు అక్కడి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారని గుర్తు చేశారు. హిందూ సంస్థల నుంచి 30 శాతం కమిషన్ అడుగుతున్నారని వార్తలొచ్చాయని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ అడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు కేటీఆర్.
అబద్దాలు ఎన్ని రోజులు చెబుతారు..?
కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ కట్టింది.. రూ. 3 లక్షల 65 వేల 797 కోట్లు.. కానీ తిరిగి వచ్చింది కేవలం రూ. లక్షా 68 వేల కోట్లు మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం, ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కేంద్రం నిధులు ఇస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇక తెలంగాణకు 3.9 లక్షలు కేంద్రం ఇచ్చిందని బీజేపీ ఎంపీ మాట్లాడుతారని... అరవింద్‌పై ధ్వజమెత్తారు. తుక్కుగూడ సభలో అమిత్ షా మాత్రం రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చామని అన్నారని గుర్తుచేశారు. ఇలాంటి అబద్దాలు ఎన్ని రోజులు చెబుతారని మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణకు దాదాపు 1 లక్ష కోట్లకు కేంద్రం నుంచి రావాల్సి ఉందని అన్నారు.
చైతన్యవంతమైన తెలంగాణలో పిచ్చి మాటలు మాట్లాడొద్దని అమిత్ షాను హెచ్చరిస్తున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో ప్రభుత్వాలు, మంత్రుల నుంచి ప్రజలు రాజనీతిజ్ఞత కోరుకుంటున్నారు. రాజకీయ నాయకుల షోను ప్రజలు కోరుకోవడం లేదు. స్థాయిని మరిచి మాట్లాడుతామంటే కదురదు. ఈ 8 ఏండ్ల కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని కోరాం. 27 ప్రశ్నలతో ఓ లేఖ కూడా రాశాను. దానికి గురించి ఒక్క మాట లేదు. నిజం చెప్పండంటే నిజాం గురించి చెప్తాడు. నిజాంను ఆయన వారసులు, మనుమండ్లు తలుచుకుంటున్నారో లేదో.. కానీ బీజేపీ నాయకులు మాత్రం నిరంతరం నిజాంను తలుచుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆదాని, అంబానీలకు దోచి పెడుతున్నారు..
అంతకుముందు తలసాని, వేముల విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒకడుగు ముందుకేసి మరీ అమిత్‌షాపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ (KCR)ను ఓడించడానికి బండి సంజయ్ ఒక్కడు చాలంటివి.. మరి నువ్వెందుకు వచ్చినవ్.. పీకనీకొచ్చినవా? అంటూ అమిత్ షాపై సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు, అభివృద్ధి నీ గుజరాత్లో చూపించమని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పులు ఎందుకు ఇవ్వదని ఆయన ప్రశ్నించారు. వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా? అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని సంపదను ఆదాని, అంబానీలకు మోదీ దోచి పెడుతున్నారని ఆరోపించారు వేముల. మేము పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.