తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని సవాల్ చేస్తున్న ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తున్న కేటీఆర్ హుజురాబాద్ నియోజకవర్గం లో నిన్న పర్యటించి తనదైన శైలిలో ఈటలను విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఈటల రాజేందర్ పై ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థిని కూడా మంత్రి కేటీఆర్ ప్రకటించేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈటల రాజేందర్ ను ఓడించాలని కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఈటల రాజేందర్ ను ఓడించడం టార్గెట్ గా పెట్టుకొని రంగంలోకి దిగారు మంత్రి కేటీఆర్ . అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రకటించేశారు. వచ్చే ఎనిమిది నెలలు ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు. దీంతో వచ్చే ఎన్నికలలో ఈటల రాజేందర్ ను కౌశిక్ రెడ్డి ఢీ కొట్టబోతున్నట్టుగా అటు పార్టీ వర్గాలలోను, స్థానికులలోను చర్చ జరుగుతుంది.
గత ఉప ఎన్నికలలో టికెట్ ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టిన గెల్లు శ్రీనివాస్ ముందే మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలవడం ఆయనకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఇక దీంతో సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని ఆయన కేసీఆర్ ను టార్గెట్ చేసే సవాల్ చేస్తున్న నేపథ్యంలో, వచ్చే ఎన్నికలలో ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు మంత్రి కేటీఆర్.
గెల్లుకు షాక్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..
గత ఉప ఎన్నికలలో బీసీ కార్డు బాగా పని చేస్తుందని గెల్లు శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చి ప్రయోగం చేశారు. కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డికి ఈటల రాజేందర్ ను ఓడించే అవకాశం ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గం లో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం హోరాహోరి పోరాటం జరుగుతుంది. ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ కు, నియోజకవర్గ ఇంఛార్జిగా అవకాశం దక్కింది. తనకే టికెట్ వస్తుంది అనుకుంటున్న వేళ కేటీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు.
దీనితో ఒక్కసారి గెల్లు వర్గం పునరాలోచనలో పడింది. పార్టీలో ఉండడమా లేకుంటే బయట దారి చూసుకోవడం అనేది సందిగ్ధంలో పడ్డారు. లాస్ట్ లో కేటీఆర్ గెల్లుకు మంచి భవిష్యత్తు ఉందని అనడం కూడా కోసమెరుపు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Etela rajender, Gellu Srinivas Yadav, Huzurabad, Karimnagar, KTR, Telangana