Home /News /telangana /

TS POLITICS MINISTER HARISH RAO HAS COUNTERED ALLEGATIONS BY BJP LEADERS THAT THERE WAS A TRS CONSPIRACY BEHIND THE SECUNDERABAD AGNIPATH RIOTS PRV

Harish rao | Agnipath: “సికింద్రాబాద్​లో అల్లర్ల వెనక TRS ఉంటే యూపీ, బిహార్​లో ఎవరున్నారు’’ : మంత్రి హరీశ్​ రావు

హరీశ్​ రావు (ఫైల్​)

హరీశ్​ రావు (ఫైల్​)

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దాడుల వెనక ఇక్కడ టీఆర్‌ఎస్‌ హస్తం ఉంటే మరి ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల వెనుక ఎవరున్నారని మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు. బీజేపీ మాటలు తీయగా, చేతలు చేదుగా ఉన్నాయన్నారు.

    ఆర్మీ రిక్రూట్​మెంట్​లో అగ్నిపథ్‌ పథకం (Agnipath Scheme) వద్దన్న యువకులను కాల్చి చంపుతున్నారని మంత్రి హరీశ్‌ రావు (Minister Harish rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్ర మంగళం పాడుతున్నదని ఆయన ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రూ.37 కోట్ల వ్యయంతో చేపట్టిన వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. ఆర్మీని ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్ని రాజుకుందని చెప్పారు.

    అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..

    సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ (Secunderabad railway station) దాడుల వెనక ఇక్కడ టీఆర్‌ఎస్‌ హస్తం ఉంటే మరి ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల వెనుక ఎవరున్నారని హరీశ్​ రావు ప్రశ్నించారు. యువకుల బాధ కేంద్రానికి అర్థంకావడం లేదని విమర్శించారు. బీజేపీ నేతలు బండి సంజయ్‌, డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ మాటలు తీయగా, చేతలు చేదుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజావ్యవతిరేక నిర్ణయాలతో ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటున్ననది చెప్పారు.

    రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే..

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (Secunderabad railway station) చోటు చేసుకున్న ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ మంచి పథకమని.. అయినప్పటికీ నిరసన తెలిపే పద్ధతి ఇది కాదని హితవు పలికారు. దీంతో ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్​ పథకం ఉండి తీరాల్సిందేనని చెప్పకనే చెబుతున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్​. ఇక సికింద్రాబాద్ విధ్వంసం వెనుక ఎవరున్నారని బండి సంజయ్​ ప్రశ్నించారు. రాళ్లు వేసింది ఎవరో తెలియదని.. గోడలు కూల్చారంటూ అనుకోకుండా జరిగింది కాదని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం వున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోయారని సంజయ్ ఆరోపించారు.

    సికింద్రాబాద్ స్టేషన్ ఘటనపై రైల్వే పోలీసులు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు స్టేషన్‌లోకి దాదాపు 300 మంది ఆందోళనకారులు ప్రవేశించినట్లు తెలిపారు. సాధారణ ప్యాసింజర్ల మాదిరిగా గేట్ నెం.3 నుంచి ఆందోళనకారులు వచ్చినట్లు వెల్లడించారు. స్టేషన్‌లోకి వచ్చీ రాగానే అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని... కర్రలు, రాడ్లతో ఆ వెంటనే 2 వేల మంది ఆందోళనకారులు స్టేషన్‌లోకి ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు.

    రైళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారని.. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినట్లు తెలిపారు. రైల్వే ట్రాక్‌పై వున్న రాళ్లతో పోలీసులపై నిరసనకారులు దాడులు చేశారని.. మొత్తం 8 రైళ్లపై దాడులకు తెగబడ్డారని వెల్లడించారు. పోలీసు బలగాలు రాగానే ట్రాక్‌పైకి ఆందోళనకారులు పరుగులు తీశారని.. ఆ వెంటనే భద్రతా సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారని వారు తెలిపారు. రాళ్ల దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతి చెందాడని.. మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్‌లో రూ.20 కోట్లు ఆస్తినష్టం సంభించినట్లు ప్రకటించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Agnipath Protest, Agnipath Scheme, Harish Rao, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు