తెలంగాణలో ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు, జులై నెలలో సంభవించిన భారీవర్షాలు, వరదలపై చేసిన ఆరోపణలకు శాసనమండలి (Legislative council)వేదికగా రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు (Harish Rao)కౌంటర్ ఇచ్చారు. మంగళవారం(Tuesday)శాసన మండలిలో రాష్ట్రంలో వరదలు, కాళేశ్వరం పంపుల మునక, వరద బాధితులకు సాయంవంటి అంశాలపై మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. చరిత్రలో మునుపెన్నడు రానంతగా గోదావరి(Godavari)కి వరద వస్తే విపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రకృతి వైపరిత్యం కారణంగా తలెత్తిన నష్టాన్ని ప్రభుత్వ పొరపాటుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అంతే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లో మునిగిపోయిన పంపులకు ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయదని క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ లోపల ప్రాజెక్టుకు ఏది జరిగినా పూర్తి బాధ్యత ఏజెన్సీదేనంటూ వివరణ ఇచ్చారు.
మండలిలో మంత్రి వివరణ..
తెలంగాణ శాసనమండలి సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో విపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ , కాంగ్రెస్ పార్టీల సభ్యులు రాష్ట్రంలో వరదలు, కాళేశ్వరం పంపుల మునక, వరద బాధితులకు సాయంవంటి అంశాలపై మండలిలో చర్చకు తీసుకు రావడంతో మంత్రి హరీష్‌రావు సమాధానమిచ్చారు. జులై నెలలో గోదావరికి వచ్చిన వరద నదీ చరిత్రలోనే ఎన్నడూ రాలేదని గడిచిన 500ఏళ్లలో ఈ స్థాయి వరదలు చూడలేదన్నారు. మహరాష్ట్ర నుంచి వచ్చిన వరదతో తెలంగాణలో గోదావరి నదీ ప్రవహించే జిల్లాల్లో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తపడ్డామన్నారు. వరదల సమయంలో మంత్రులు, అధికారులతో పునరావాస ప్రాంతాల్లో ముంపు బాధితులకు భోజనం దగ్గర నుంచి అన్నీ సమకూర్చామన్నారు మంత్రి హరీష్‌రావు. ఆ సమయంలో ములుగు, భద్రాద్రి జిల్లా, ఖమ్మం జిల్లా, మంచిర్యాల , నిర్మల్ జిల్లా కలెక్టర్లు, పోలీసులు, జిల్లా సిబ్బంది, వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడేలా పనిచేశారని వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
గొబెల్స్ ప్రచారం మానుకోవాలి..
ప్రకృతి వైపరిత్యం కారణంగా తలెత్తిన పరిస్థితుల్ని విపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పంపులు మునిగిపోతే అది మానవ తప్పిదంగా ప్రభుత్వం చేసిన పొరపాటుగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినట్లుగా చెప్పారు. కాళేశ్వరంలో 21 పంపు హౌస్‌లు ఉంటే నదిని ఆనుకొని ఉన్న మేడిగడ్డ, అన్నారం పంపు హౌస్‌లోకి మాత్రమే నీరు చేరిందని దానికి ప్రాజెక్టు అంతా మునిగిపోయినట్లుగా ప్రతిపక్ష పార్టీల నేతలు రాక్షస ఆనందం పొందారని మంత్రి చెప్పారు. స్వయాన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వచ్చి తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గ్రోత్ ఇంజన్, సాగు,తాగు, పారిశ్రామిక అవసరాలు తీరతాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.అంతే కాదు అన్నారం పంప్ హౌస్ సెప్టెంబర్ మూడో వారంలో నీళ్లు పోయడం ప్రారంభం అవుతుందన్నారు. మెడిగడ్డ అక్టోబర్ నెలాఖరులోగా నీళ్లు పోయడం ప్రారంభమవుతుందన్నారు మంత్రి.
గోదావరి వరదపై బురద రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు : శాసనమండలిలో మంత్రి శ్రీ @trsharish. pic.twitter.com/mNcOCXFYEL
— TRS Party (@trspartyonline) September 6, 2022
వరదల్లో బురద రాజకీయం తగదు..
రాష్ట్రంలో కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు అర్ధం లేనివన్నారు. 2014-15లో రాష్ట్రంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. గతేడాది రాష్ట్రంలో వరి ఉత్పత్తి 2 కోట్ల 59 లక్షల మెట్రిక్ టన్నులు పంట పండిందన్నారు. ఎకరాకు కూడా నీరు ఇవ్వకపోతే ఇంత పంట ఎలా పండిందని ప్రశ్నించారు. అంతే కాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని ఒక కేంద్రమంత్రి చెప్పడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. డీపీఆర్ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఎలా పర్మిషన్ ఇచ్చిందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు నియోజకవర్గంలోకి నీరు రావడానికి మల్లన్నసాగర్ దగ్గర గేటు ఎత్తి నీరు వదలి, పూలు జల్లి పూజ చేస్తే ఆ పార్టీ నేతలు ఒక్క ఎకరం లేదని మాట్లాడటం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. విపక్షాలు ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదనే గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయన్నారు. పెరిగిన వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు మంత్రి హరీష్‌రావు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.