Telangana: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తగువును మిల్లర్లు అడ్వాంటెజ్‌గా తీసుకుంటున్నారు. రైతుల దగ్గరున్న ధాన్యాన్ని కారుచౌకగా కొనుగోలు చేస్తూ అన్నదాతల్ని నిలువుదోపిడి చేస్తున్నారనే విమర్శలున్నాయి. వేరే దారిలేక పోవడం వల్లే నష్టం వచ్చినా అమ్ముకోవాల్సిన పరిస్థితి అంటున్నారు రైతన్నలు.
తెలంగాణ(Telangana)లో వరి పండించిన రైతుల(Paddy farmers)కు తిప్పలు తప్పడం లేదు. గతంలో సాగు చేయడానికి ఇబ్బందులు పడిన అన్నదాతలు ఇప్పుడు పండించిన ధాన్యం అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పంతం కారణంగా రైతులే తీవ్రంగా నష్టపోతున్నారు. రబీ సీజన్లో పండిన వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తగువులాట తెగేలా కనిపించకపోవడంతో రైతులు పంటను కాపాడుకునేందుకు చూస్తున్నారు. ఇందుకోసం ధాన్యం పొలాల్లో, కళ్లాల్లో ఉంటే వడగళ్లు, అకాలవర్షాల పాలవుతుందని మిల్లర్ల(Millers)ను ఆశ్రయిస్తుంటే వాళ్లు రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రబీ సీజన్లో సేకరణకు సిద్ధంగా 70లక్షల టన్నుల ధాన్యం (70lakh tonnes grains)ఉండగా..వాటిని కొనుగోలు చేసే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి హామీ లేదు. దీంతో రైతుల కాయ, కష్టంతో దిగుబడి అయిన పంటను మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ చిన్న లాజిక్‌ని రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు రైతుల నుంచే వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రైతుల నుంచి ధాన్యాన్ని అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని రైతులే ఆరోపిస్తున్నారు.
అన్నదాతల్ని ఆదుకునేవారేరి..
రాష్ట్రంలో మొత్తం 2500రైస్ మిల్లులు ఉండగా ..అందులో ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ మొత్తం రైస్ మిల్లుల ఓనర్లు ఒక్కమాటపై నిలబడి రైతుల దగ్గరున్న ధాన్యాన్ని క్వింటాకు రూ.500 రూపాయలు తక్కువగు కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పండే చింతల, హెచ్ఎంటీ సూపర్‌ఫైన్ క్వాలిటీ వరి రకాలైన ధాన్య గతంలో క్వింటాల్‌కు రూ.2,100 నుంచి రూ.2,200 పలికేవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట కారణంగా ప్రస్తుతం మిల్లర్లు అవే ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1,800 నుంచి రూ.1,900 మాత్రమే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఈ తరహా దోపిడీ ఒక్క నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇదే తీరుగా జరుగుతోంది. గతంలో వేర్వేరుగా ఉండటం కారణంగా ఒక జిల్లాలో తక్కువ ధర ఉంటే మరో జిల్లాకు తీసుకెళ్లి అమ్ముకునే అవకాశం ఉండేది.
వాళ్లది పంతం..వీళ్లది దోపిడీ..
రైస్ మిల్లర్లు అంతా ఒక్కమాటపై నిలబడి ఈ పద్దతిలో తమకు కుచ్చుటోపి పెడుతున్నారని రైతుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. కేవలం రబీ సీజన్‌ని అడ్డుపెట్టుకొని వేర్వేరు నాణ్యత కలిగిన ధాన్యానికి మిల్లర్లు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1,940 1,300, 1,600 గా నిర్ణయించారని రైతులంటున్నారు. కేంద్రం, రాష్ట్రం మధ్య ధాన్యం కొనుగోలు పంచాయితీ జరగక ముందు మార్కెట్లో సూపర్ ఫైన్ క్వాలిటీ వరి వంగడాలకు డిమాండ్ బాగానే ఉండేది. మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసిన మిల్లర్లే ఇప్పుడు తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశనానికి రైతన్న వెన్నుముక అనే నానుడిని మర్చిపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల్ని ఆదుకునేందుకు చెరో మెట్టు దిగొస్తే బాగుంటుందని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.