CM KCR Emotinal Speech: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పటి నుండి ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్టీ విస్తరణపై ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు నిర్వహించి పలువురిని పార్టీలోకి చేర్చుకున్నారు. ఇక తాజాగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్, పలువురు నాయకులు, మద్దతుదారులు బీఆర్ఎస్ లో చేరారు.
వీరి చేరికల సందర్బంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ జీవితంలో ఎన్నో ఆటు పోట్లను చూశానని..ఆనాటి పరిస్థితులు తనకు తెలుసన్నారు. తన రాజకీయ జీవితమంతా పోరాటాలే అని అన్నారు. గత 8 ఏళ్లుగా రైతులను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని విమర్శించారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక ముందు కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని..గత ప్రభుత్వాలు తమ ప్రాంత ప్రజలను హింసించాయని..రోజుకు ఐదారుగురు రైతులు చనిపోయే పరిస్థితి ఉండేదన్నారు. ఆనాడు ఆ రైతుల పరిస్థితిని తలుచుకుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయని కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు.
Leaders from Maharashtra joining the BRS Party in the presence of BRS President, CM Sri KCR. https://t.co/MTnQlwz6hi
— BRS Party (@BRSparty) April 1, 2023
ఢిల్లీ ధర్నాలో 750 మంది రైతులు అమరులయ్యారని..అయినా కానీ చెక్కు చెదరకుండా ఉద్యమం కొనసాగించారని అన్నారు. ఇప్పటివరకు కూడా ప్రధాని మోదీ వాళ్లకు ఇచ్చిన ఒక్క మాట కూడా అమలుకు నోచుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితులు మారాయి. దేశమంతా కూడా ఇదే మార్పు రావాలని కేసీఆర్ ఆకాక్షించారు. ఇప్పుడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని అన్నారు. రైతులు ఇంకా ఎంతకాలం గిట్టుబాటు ధర కోసం పోరాడాలని కేసీఆర్ ప్రశ్నించారు. పంజాబ్ , ఉత్తరప్రదేశ్ ఎన్నికలు లేకుంటే కేంద్రం ఆ చట్టాలను రద్దు చేసేది కాదన్నారు.
ఒకప్పుడు సింగపూర్ ఎలా ఉంది? ఇప్పుడు సింగపూర్ ఎలా ఉందని? కేసీఆర్ ప్రశ్నించారు. ఏ వనరులు లేని సింగపూర్ అంతలా అభివృద్ధి చెందితే..అన్ని వనరులు ఉన్న భారతదేశం ఎంత అభివృద్ధి చెందాలని అన్నారు. 14 మంది ప్రధానమంత్రులు మారినా..మన దేశ తలరాత మాత్రం మారలేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, CM KCR, Maharashtra, Telangana