కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు కోమటిరెడ్డి ప్రకటించారు. కాగా కొంతకాలంగా కోమటిరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ఇటీవల ప్రకటించిన కొత్త కమిటీలలో కూడా కోమటిరెడ్డి పేరు ఎక్కడా కనిపించలేదు. ఒకానొక సమయంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇటీవల కాంగ్రెస్ కొత్త ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే తెలంగాణకు వచ్చి నాయకులందరితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నాయకులంతా పాదయాత్ర చేపట్టాలని, వారి వారి నియోజకవర్గాలు పట్టున్న స్థానాల్లో ఈ పాదయాత్ర కొనసాగించాలని సూచించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
సమయం తక్కువ ఉన్నందున బస్సు లేదా బైక్ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నా. నల్గొండ, ఖమ్మం , మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర చేపట్టనున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ప్రజలకు చెబుతానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టగా..పలువురు నాయకులు కూడా త్వరలోనే పాదయాత్ర ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రగతిభవన్ పై రేవంత్ వ్యాఖ్యలు..కోమటిరెడ్డి రియాక్షన్..
ఇక ప్రగతిభవన్ ను బాంబ్ పెట్టి పేల్చేలయాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. ప్రగతిభవన్ ను ప్రజాదర్భార్ గానో లేక ఆసుపత్రిగానో వాడుకోవాలని రేవంత్ అంటే బాగుండేది కానీ అలా అనకుండా ఉండాల్సిందన్నారు.
మరోవైపు రేవంత్ పాదయాత్రకు సీనియర్ నేతల మద్దతు లేకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లతో(Congress party senior leaders) ఉన్న విభేదాలకు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సీనియర్ నేతలెవరూ ఆయన పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి వెళ్లలేదు. ఆయనతో కలిసి పాదయాత్రలో నడవాలనే ఆలోచన కూడా సీనియర్ నేతలెవరికీ కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా నిలిచి..ఆయనతో కలిసి నడిచి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి మరో రకంగా ఉండేదనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది.
కానీ రేవంత్ రెడ్డి అంటే ఏ మాత్రం పొసగని సీనియర్ నేతలు పాదయాత్ర విషయంలో ఆయనకు సహకరిస్తారని ఎవరూ భావించడం లేదు. అయితే రాబోయే రోజుల్లోనూ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇదే రకంగా కొనసాగితే.. ఆయన యాత్ర ఉద్దేశ్యం నెరవేరే అవకాశం ఉంటుందా ? అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అంటే పొసగని నేతలు.. తమ నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్రకు ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా సస్పెన్స్‌గా మారింది.
ఇక రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వారిలో కోమటిరెడ్డి ఒకరు. దీనితో కోమటిరెడ్డి రేవంత్ పాదయాత్రలో ఒక్కరోజైనా పాల్గొంటారా లేక ఆ కోమటిరెడ్డి సొంతంగా ఆ 4 జిల్లాల్లో మాత్రమే పాదయాత్ర చేపడతారా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Komatireddy venkat reddy, Mp revanthreddy, Telangana