హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి అనుచరుల దారెటు ? పరిస్థితి మారిపోతుందా ?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి అనుచరుల దారెటు ? పరిస్థితి మారిపోతుందా ?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు రాజగోపాల్ రెడ్డితో కలిసి బీజేపీలోకి వెళితే.. అది కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

  తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్(కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి)కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ ఇద్దరు కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేతలే అయినా.. జిల్లా వ్యాప్తంగా వీరికి అనుచరగణం ఉంది. ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న తమ అనుచరగణాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers) ప్రత్యేకత. అందుకే టీఆర్ఎస్ హవా బలంగా వీచిన సమయంలోనూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఎమ్మెల్సీగా నిలబడి విజయం సాధించారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించడం వెనుక ఇది కూడా ఒక కారణం.

  అయితే వీరి అనుచరులు, అభిమానుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతోందనే దానిపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్. కానీ ఇప్పుడు ఈ బ్రదర్స్ చెరో పార్టీలో ఉండబోతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించగా.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. దీంతో వీరి అనుచరులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా ? లేక బీజేపీలో చేరతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

  అయితే ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఫోకస్ అంతా కేవలం మునుగోడు మీదే ఉందని.. కాబట్టి ఆయన ఉమ్మడి నల్లగొండ (Nalgonda)  జిల్లాపై దృష్టి పెట్టడం లేదనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తే.. ఆయన తమ అనుచరగణంలోని నాయకులను బీజేపీలోకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాజకీయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బలమైన నాయకుడే అయినా.. రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగానూ బలమైన నేత అనే వాదన ఉంది. దీనికి తోడు ఆయన ఇప్పుడు బీజేపీలో చేరుతుండటంతో.. ఆర్థిక వనరుల విషయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చనే టాక్ ఉంది.

  Telangana : మూడేళ్లకే టీఆర్ఎస్‌పై మండవకు విరక్తి ..! అందుకే పార్టీ చేంజ్.. ముహుర్తం ఎప్పుడంటే ..?

  Chandrababu Naidu: మళ్లీ చంద్రబాబు ఎంట్రీ.. తెలంగాణలో పొలిటికల్ సీన్ మారుతుందా ?

  ఒకవేళ జిల్లాలోని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరులు రాజగోపాల్ రెడ్డితో కలిసి బీజేపీలోకి వెళితే.. అది కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలోని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరగణం కూడా ప్రస్తుతం డైలమాలో పడిపోయిందని.. భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందనే దానిపై వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుల దారెటు అన్నది జిల్లా రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Komatireddy rajagopal reddy, Nalgonda, Telangana

  ఉత్తమ కథలు