రాజకీయాల్లో వర్గవిభేదాలు, అంతర్గత విభేదాలు, ప్రత్యర్ధులతో తగాదాలు ఉండటం కామన్. అయితే తెలంగాణలో నియోజకవర్గ స్థాయి అధికార పార్టీ నాయకుడిని కామెంట్ చేస్తూ ఓ కార్యకర్త సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ పెట్టాడు. అది కాస్తా వైరల్(Viral) అయింది. అయితే ఈవిషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు(Police)అధికార పార్టీ నాయకుడి అనుచరులుగా వ్యవహరించడం ఇప్పుడు కరీంనగర్ (Karimnagar)జిల్లాలో పెద్ద దుమారం రేపుతోంది. చేతుల్లో లాఠీలు ఉన్నాయని..ఒంటిపైన ఖాకీ యూనిఫామ్ ఉందనే ఒకే ఒక్క అర్హత చూసుకొని అతడ్ని చితక్కొట్టిన ఘటనతో పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియా పోస్ట్..
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన వార్త ఇది. స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ మూడు రోజుల క్రితం నియోజకవర్గంలోని కూర్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. అక్కడే నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే రవిశంకర్. ఆ అదే ఫోటోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన తొంటి పవన్ అనే కార్యకర్త ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని కింద బొక్క ఆశకు కుక్క వచ్చింది అంటూ కామెంట్ షేర్ చేశాడు. అంతే ఈవార్త చొప్పదండి నియోజకవర్గంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లాఠీలకు పని చెప్పిన పోలీసులు..
తొంటి పవన్ పోస్ట్‌పై అభ్యంతరం తెలుపుతూ మంగళంపల్లికి చెందిన వేమా శ్రీనివాస్‌రెడ్డి అనే టీఆర్ఎస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గురువారం తొంటి పవన్‌కుమార్‌పై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పెట్టిన పోస్ట్‌పై విచారణతో పేరుతో బాధితుడ్ని తీవ్రంగా కొట్టారు. లాఠీలతో తమ ప్రతాపం చూపించారు. పోలీసులు లాఠీలతో పవన్‌ని కాళ్లు, అరికాళ్లలో కొట్టిన దెబ్బలకు ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాడు. కాళ్లకు తీవ్ర గాయలయ్యాయి. పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా తనను లాఠీలతో కొట్టారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించకుండా కొట్టడం ఏమిటని బాధితుడు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఎమ్మెల్యే రవిశంకర్ చెబితేనే వదిలేస్తామంటూ చిత్రహింసలకు గురి చేశారని మీడియాతో మొరపెట్టుకున్నాడు తొంటి పవన్.
వైరల్ అవుతున్న వార్త...
నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ సోషల్ మీడియా ఇష్యూ ఇప్పుడు ఇంకా వైరల్ అవుతోంది. మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు, పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేని అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు కాబట్టే టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారని పోలీసులు సమర్ధించుకుంటున్నారు. అయితే నిందితుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు తొంటి పవన్ మీడియాను ఆశ్రయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Police Case, Social medai, TRS leaders