తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ఎంతవరకు సక్సెస్ అయ్యారనే ప్రశ్నకు సమాధానం రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఇప్పటికైతే ఆమె ఇంకా తెలంగాణ రాజకీయాల్లో రాణించే విషయంలో మాత్రం స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నారు. షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపే స్థాయికి ఎదుగుతారా ? లేదా ? అన్నది చెప్పడం ఇప్పటికప్పుడు కష్టమే. అయితే తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని అంటున్న ఆమె నినాదానికి ఇక్కడ ప్రజలు ఆకర్షితులు అవుతున్నట్టు కనిపించడం లేదు. తనకు తానుగా ప్రజల్లోకి వెళ్లడంలో షర్మిల ముందున్నా.. వారిని ఆకర్షించడంలో మాత్రం ఆమె ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదేమో అనే వాదన వినిపిస్తోంది. అయితే పార్టీ పెట్టి కొన్ని నెలల మాత్రమే కావడంతో.. షర్మిల తెలంగాణలో సక్సెస్ కాలేదనే అంచనాకు రావడం పొరపాటే అవుతుంది.
అయితే ప్రజలను ఆకర్షించడానికి ముందు పలువురు నేతలను తమ వైపు తిప్పుకోవడంలో షర్మిల ఎంతవరకు విజయం సాధించారన్నది మాత్రం చర్చనీయాంశమే. అయితే ఈ విషయంలో షర్మిల అంతగా సక్సెస్ కాలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. షర్మిల పార్టీలో తెలంగాణకు చెందిన పేరున్న నాయకుడు ఎవరూ చేరలేదు. అసలు అలాంటి నాయకుడు ఒకరు ఆమె పార్టీలో చేరుతున్నారనే సమాచారం కూడా లేదు. దీనికి తోడు ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న ఇందిరా శోభన్ వంటి నేతలు బయటకు వెళ్లిపోయారు. దీంతో షర్మిల పార్టీలోకి నాయకులను తీసుకొచ్చే బాధ్యతను ఎవరు తీసుకుంటారనే చర్చ మొదలైంది. ఇందుకోసమే అన్నట్టుగా ఆమె తల్లి, దివంగత వైఎస్ఆర్ భార్య విజయమ్మ రంగంలోకి దిగారు. ఇటీవల ఆమె వైఎస్ఆర్ సంస్మరణ సభ నిర్వహించారు.
ఆ సభకు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు, పలు రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ సమావేశం ద్వారా ఆమె షర్మిల పార్టీకి పొలిటికల్ మైలేజీ ఇవ్వాలని అనుకున్నారనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ సభ ద్వారా ఆమె అనుకున్న ఫలితాలు వచ్చాయా ? అన్నది కూడా సస్పెన్సే. నిజానికి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నప్పుడు ఆమె వెంట నడవాలని అనేక మంది నేతలకు ఫోన్ చేసి కోరారు వైఎస్ విజయమ్మ.
అయితే చాలామంది ఆమె విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోలేదు. ఇందిరా శోభన్ వంటి నేతలు షర్మిల పార్టీలో చేరడం వెనుక విజయమ్మ ఆహ్వానమే కారణమే వాదన కూడా ఉంది. అయితే అలాంటి వాళ్లు సైతం ఇప్పుడు షర్మిల పార్టీలో ఎంతకాలం కొనసాగుతారనే దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే విజయమ్మ మరోసారి రంగంలోకి దిగారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Huzurabad: ‘హుజూరాబాద్’పై రేవంత్ రెడ్డికు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇస్తుందా ?
Night: రాత్రిపూట తరచూ గొంతు తడారిపోతుందా ?.. చాలా డేంజర్.. దేనికి సంకేతమో తెలుసా..
షర్మిలకు రాజకీయంగా అండగా నిలవాలని కోరేందుకే ఆమె ఈ సభను ఏర్పాటు చేశారనే ప్రచారం జరిగింది. అయితే ఈ సభకు వచ్చిన నేతలు కేవలం వైఎస్ఆర్‌ను స్మరించుకోవడానికి మాత్రమే పరిమితమయ్యారని.. షర్మిల రాజకీయ పార్టీని వాళ్లు పెద్దగా గుర్తించినట్టు కనిపించలేదనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి కూతురు షర్మిల తెలంగాణలో పెట్టిన పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను భుజాన వేసుకున్న విజయమ్మ.. ఇందుకోసం ఇంకెలాంటి ప్రయత్నాలు చేస్తారో అనే ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, YS Sharmila, YS Vijayamma, Ysrtp