TS POLITICS IS CONGRESS REBEL MLA JAGGA REDDY COMPROMISED WITH TPCC REVANTH REDDY IN MEETING WITH RAHUL GANDHI MKS
Jagga Reddy: జగ్గారెడ్డి విషయంలో రేవంత్ చెప్పిందే నిజమైందా? -రాహుల్ ముందు నోరెత్తని రెబల్ నేత!
జగ్గారెడ్డితో రేవంత్(పాత ఫొటో)
రాహుల్ గాంధీతో టీకాంగ్రెస్ నేతల భేటీలో రెబల్ నేత జగ్గారెడ్డి మౌనం వహించారు. దీంతో జగ్గారెడ్డి తిరుగుబాటు కాంగ్రెస్ టీకప్పులో తుఫాను లాంటిదంటూ రేవంత్ చెప్పిన మాట నిజమైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ సర్కారు, మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కారుపై పోరాడాల్సింది పోయి తెలంగాణకాంగ్రెస్ నేతలు అంతర్గత కుమ్ములాటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శ ఉంది. ఇటీవల టీకాంగ్రెస్ లో రెబల్ గిరీకి కేరాఫ్ గా నిలిచారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించిన ఆయన ఒక దశలో కేసీఆర్ కారెక్కుతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ హైకమాండ్ ఆయన రాజీనామాను ఆమోదించకపోవడంతో విధిలేక కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయితే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం తాను కాంప్రమైజ్ కాబోనని, రేవంత్ ఏకపక్ష దూకుడును నిలువరించేదాకా నిద్రపోనని జగ్గారెడ్డి పలుమార్లు శపథాలూ చేశారు. సోమవారం రాత్రి ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ నిర్వహించిన టీకాంగ్రెస్ నేతల భేటీలో జగ్గారెడ్డి ప్రత్యేక ఆకర్షణగానూ నిలిచారు. రాహుల్ ఎదుట జగ్గారెడ్డి.. రెవంత్ ను కడియేడం ఖాయమని అంతా భావించినా వాస్తవానికి సీన్ మరోలా సాగింది..
ఏఐసీసీ ఇంచార్జిలకు లంచాలు ఇచ్చిమరీ పీసీసీ పదవి కొనుక్కున్నాడంటూ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అతి తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే కీలక నేత కావడంతో ఆయనపై చర్యలకు అధిష్టానం వెనుకడుగువేసింది. రాహుల్ గాంధీతో ప్రత్యేక సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన 38 మంది ముఖ్యనేతల్లో జగ్గారెడ్డి కూడా ఉన్నారు. మిగతా నేతలకు భిన్నంగా కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లిన జగ్గారెడ్డి.. వీలును బట్టి రాహుల్ లేదా సోనియా గాంధీ ముందే రేవంత్ అంశాన్ని లేవనెత్తాలనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ మైత్రి సందేశంతో జగ్గారెడ్డి మెత్తబడిపోయారు.
ఢిల్లీ వేదికగా టీకాంగ్రెస్ ముఖ్యులు 38 మందితో రాహుల్ గాంధీ సోమవారం రాత్రి మూడు గంటలపాటు మాట్లాడారు. ఆ సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి ఒక్కరే ఒకే ఒక్క సందర్భంలో రేవంత్ పై అసంతృప్తిని వెళ్లగక్కారు. కాగా, రెబల్ నేత జగ్గారెడ్డికి మాట్లాడే అవకాశం చివరిగా వచ్చింది. అయితే అప్పటికే ‘మనం అంతా ఒక కుటుంబం.. కలిసి కట్టుగా పనిచేయాలి’ అంటూ రాహుల్‌గాంధీ దిశానిర్దేశం చేయడంతో జగ్గారెడ్డి ఫిర్యాదు జోలికి వెళ్లలేదు. ఈలోపే..
పార్టీలో సీనియర్లకు అవమానం జరుగుతోందని, అందరినీ గౌరవించేలా చూడాలని జానారెడ్డి, ఉత్తర్ కుమార్ రెడ్డి.. రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. కొంత మంది నేతలు రాహుల్‌తో ముఖాముఖి సమావేశాన్ని కోరారు. ఇంకొందరు నేతలు రాతపూర్వక ఫిర్యాదులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు అందజేసినట్లు సమాచారం. మొత్తంగా ఢిల్లీలో జగ్గారెడ్డి వ్యవహరించిన తీరు చూస్తుంటే ఆయన మెత్తబడ్డట్లుగా కనిపించారని, రాహుల్ నిర్దేశం మేరకు రేవంత్ రెడ్డి, ఇతర నేతలతో కాంప్రమైజ్ ధోరణి అనుసరించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి తిరుగుబాటు వ్యవహారం కాంగ్రెస్ టీకప్పులో తుఫాను లాంటిదంటూ రేవంత్ చెప్పిన మాట నిజమైందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి జగ్గారెడ్డి నిజంగానే రెబల్ గిరీ వదిలేశారా? రేవంత్ తో కలిసి పనిచేయబోతున్నారా? అనే ప్రశ్నలకు ఆయనే సమాదానం చెప్పాలి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.