TS POLITICS INTERNAL FIGHT IN NALGONDA CONGRESS LEADS TO ATTACK ON CONGRESS LEADER ADDANKI DAYAKAR IN THUNGATHURTHY DETAILS HERE MKS
Addanki Dayakar : కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై దాడి.. పార్టీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..
అద్దంకి దయాకర్ (పాత ఫొటో)
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై దాడి ఘటనతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా కాంగ్రెస్ లో కీలక నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి, అద్దంకి దయాకర్ వర్గానికి మధ్య కొంతకాలంగా సాగుతోన్న ఆధిపత్యపోరు దాడుల మలుపుతీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దళిత ఉద్యమకారుడు అద్దంకి దయాకర్‌పై దాడి (Attack On Addanki Dayakar) ఘటనతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా కాంగ్రెస్ (Congress Party) లో కీలక నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి, అద్దంకి దయాకర్ వర్గానికి మధ్య కొంతకాలంగా సాగుతోన్న ఆధిపత్యపోరు దాడుల మలుపుతీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కొండరాజు వివాహ వేడుకలో పాల్గొనేందుకు దయాకర్ ఆదివారం నాడు తుంగతుర్తికిరాగా, దామోదర్ రెడ్డి వర్గీయులు ఆయనను అడ్డుకున్నారు. తోపులాటలో వైరివర్గీయులు దయాకర్ చొక్కాపట్టుకొని లాగేసి, కొట్టబోయారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటన కాంగ్రెస్ లో కలకలానికి దారితీసింది.
అధికారంలో లేకపోయినా అంతర్గత పోరులో మాత్రం తామే ముందుంటామని కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. ఐక్యంగా పనిచేయాలంటూ ఇటీవల రాహుల్ గాంధీ చేసిన హితోపదేశాన్ని మర్చిపోయి బహిరంగంగా దాడులకు తెగబడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇటీవల కాలంలో దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరిపై ఏఐసీసీకి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో అద్దంకి దయాకర్‌పై దామోదర్‌రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హింసకు దిగారు.
అద్దంకి దయాకర్‌పై జరిగిన దాడిని దళిత సంఘాలు ఖండించాయి. దామోదర్ రెడ్డి వర్గీయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కొద్ది రోజుల కిందట దయాకర్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా సొంత పార్టీ నేతలైన దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై విమర్శలు చేశారు. ఇందుకుగానూ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసులు జారీచేయగా, దయాకర్ వివరణ ఇచ్చుకున్నారు. చర్యలేవీ లేకపోవడంతో ఇక వివాదం సర్దుమణిగినట్లేననే సంకేతాలొచ్చినా, తాజా దాడితో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
2018 ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుండి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ నియోజకవర్గంపై పట్టు నిలుపుకొనే లక్ష్యంతో దామోదర్ రెడ్డి తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. తర్వాతి కాలంలో దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకొంటున్నాయి. ఈ విషయమై పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందని అద్దంకి దయాకర్ వర్గం వాదిస్తుంది. తాజా ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.