ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి (Marri Sashider reddy) శుక్రవారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మర్రి శశిధర్ రెడ్డికి కేంద్ర మంత్రి శర్భానంద్ సోనేవాల్ బీజేపీ సభ్యత్వం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay), లక్ష్మణ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సమక్షంలో మర్రి కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ పై మర్రి సెన్సేషనల్ కామెంట్స్..
బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత మర్రి శశిధర్ రెడ్డి (Marri Sashider reddy) కాంగ్రెస్ పై మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని, టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కానీ పనని ఎద్దేవా చేశారు. తాను అన్ని ఆలోచించాకే బీజేపీలో చేరానని, గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్దే జరగలేదన్నారు. టీఆర్.ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపినేనని మర్రి ధీమా వ్యక్తం చేశారు.
కాగా పార్టీకి రాజీనామా అనంతరం మర్రి కాంగ్రెస్ పార్టీపై సంచలన విమర్శలు చేశారు..చాలా బాధతో కాంగ్రెస్ ను వీడుతున్నట్లు, ఈ పరిస్థితి వస్తుందని తాను అస్సలు ఊహించలేదని అన్నారు. తన ట్విట్టర్ లో Allways congress అని ఉంటుంది కానీ పరిస్థితులు మారిపోయాయని వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ఎన్నికైన తరువాత జరిగిన ఎన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని స్థితికి చేరుకుందన్నారు. ఒక హోమ్ గార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదన్నారు. ఇక ఇక్కడ జరిగేది ఏమి మాణిక్యం ఠాకూర్ కు తెలియదని చెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిలు పీసీసీలకు ఎంజెంట్లుగా మారారని ఆరోపించారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన స్థితిలో కాంగ్రెస్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి అన్ని అంశాలను సోనియాగాంధీకి పంపించిన లేఖలో పొందుపరిచినట్లు తెలిపారు.
కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్..
కాగా ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి (Marri Shasidhar Reddy)ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ అవ్వడం, కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. ఆరేళ్లపాటు ఆయనను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై వేటు వేసినట్లు తెలుస్తుంది. కానీ మర్రి అనూహ్య నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకే షాకిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Hyderabad, Telangana, Telangana Politics, TS Congress