సరిగ్గా మునుగోడు(Munugodu) ఉపఎన్నికల వేళ టీఆర్ఎస్‌ని వీడిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్(Boora Narsaiah Goud) బీజేపీ(BJP)లో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరబోతున్నది అధికారికంగా ప్రకటించని మాజీ ఎంపీ నవంబర్ 19( November19)న ఢిల్లీ పెద్దల సమక్షంలోనే కమలం తీర్ధం పుచ్చుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. బానిస బతుకులు తట్టుకోలేకే పార్టీని వీడుతున్నానని సీఎం కేసీఆర్(KCR)కు లేఖ ద్వారా జలక్ ఇచ్చిన ఈ బీసీ నాయకుడు .. బీజేపీలో చేరడానికి బలమైన కారణం మునుగోడు టికెట్ ఆశించి భంగపడటమేనని అందరికి తెలుసు. ఉద్యమ సయమం నుంచి టీఆర్ఎస్(TRS)లో ఉంటూ కేసీఆర్ వెంటే నడుస్తూ వచ్చారు. రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఒకసారి గెలిచారు. తాజాగా ఆయన పార్టీ మారడం బీజేపీకి కలిగే ప్రయోజనం పక్కన పెడితే టీఆర్ఎస్‌కు మాత్రం బీసీ ఓట్లు కొంత చేజారిపోయే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
19న చేరిక ఫిక్స్ ..
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను వీడిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ అన్నీ పార్టీల్లో కొనసాగింది. ఆయన కూడా తనకు కాంగ్రెస్ , బీజేపీ నుంచి ఆహ్వానం అందిందని ..ఏ పార్టీలో చేరుతానో త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి మ్యాటర్‌ని సస్పెన్స్‌లో పెట్టారు. అయతే 24గంటల క్రితం మంత్రి జగదీష్‌రెడ్డి బూర నర్సయ్యగౌడ్‌కి ఢిల్లీ బీజేపీ నేతలు కనీసం అపాయింట్‌మెంట్ కూడ ఇవ్వడం లేదని ట్వీట్ చేయడంతో ఆయన సైడ్ నుంచి సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈనెల 19వ తేదిన బూర నర్సయ్యగౌడ్ ఢిల్లీ బీజేపీ పెద్దల సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. అటుపై అక్కడి నుంచి వచ్చి మునుగోడులో నిర్వహించే బహిరంగ సభ ద్వారా తన అనుచరులు, అభిమానుల మధ్య బీజేపీ కండువా మార్చుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.
టీఆర్ఎస్‌కు నష్టమేనా..
బూర నర్సయ్యగౌడ్ మాజీ ఎంపీగాననే కాకుండా ఫేమస్ డాక్టర్‌గా పేరుంది. దానికి తోడు ఇంతకాలం టీఆర్ఎస్‌లో వివాదరహితుడిగానే కొనసాగారు. అయితే బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం,మునుగోడులో అత్యధికంగా బీసీ ఓట్లు ఉండటంతో బూరనర్సయ్య గౌడ్ బీజేపీలో చేరికతో ఉపఎన్నికపై ప్రభావం చూపే అవకాశముంది. టీఆర్ఎస్‌కి బీసీ ఓట్లు తగ్గే అవకాశముందని నియోజకవర్గంలోని బీసీ సంఘాలు భావిస్తున్నాయి.
ఉపఎన్నిక తర్వాత..
మునుగోడు ఉపఎన్నిక టికెట్ తనకు ఇవ్వకపోవడం, కనీసం పార్టీ కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ప్రచారంలో దూరంగా పెట్టడం వల్లే ఆయన చిన్నబుచ్చుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి తనను కలుపుకుపోవడం లేదని కోపంతో పాటు తాను పార్టీలో బానిసగా బ్రతుకుతున్నానని కేసీఆర్‌కి లేఖ రాయడం చూస్తుంటే బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్‌ను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో చేరిన తర్వాత బూర నర్సయ్య గౌడ్‌కి కమలనాథులు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూడాలి. లేదంటే మంత్రి జగదీష్‌రెడ్డి కామెంట్ చేసినట్లుగా పార్టీలో చేర్చుకొని పక్కన పెడతారో మునుగోడు ఎన్నికల తర్వాత తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.