కాంగ్రెస్ పార్టీకి (Congress party)మరో బిగ్ షాక్ తగిలింది. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 24 గంటలు గడవక ముందే తెలంగాణకు చెందిన మరో సీనియర్ నాయకుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ (Hyderabad) ఓల్డ్‌సిటీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంఏ ఖాన్ (MA Khan) తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంఏ ఖాన్ కాంగ్రెస్‌లో ఆజాద్ (Azad) ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతోనే ఎంఏ ఖాన్ ఇవాళ కాంగ్రెస్‌కు రాజీనామా (Resignation) చేశారు. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులను బుజ్జగిస్తూ గాడిన పెడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇది ఎదురుదెబ్బే.
చేరికలతో పలువురు అలక..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆందోళనలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు వలసలను ప్రొత్సహించేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, గ్రేటర్ పరిధిలోని టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైన విషయమే అయినా.. కాంగ్రెస్‌లోని చేరికలు ఆ పార్టీలోని కొందరు నేతల్లో టెన్షన్ పెంచుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండొద్దని ఆ పార్టీ నేతలు అనుకోవడం లేదు. అయితే కొత్తగా చేరికల వల్ల ప్రస్తుతం ఉన్న నేతలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చాలామంది భావిస్తున్నారు.
ఇటీవల నల్లాల ఓదెలు చేరిక తరువాత అదిలాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తులు చెలరేగినట్టు వార్తలు వచ్చాయి. ఆయన చేరిక గురించి జిల్లా కాంగ్రెస్‌లో సీనియర్ నేతలుగా ఉన్న ప్రేమ్‌సాగర్ రావు సహా పలువురు ఇతర నేతలకు సమాచారం లేదని ప్రచారం సాగుతోంది. దీంతో అసలు ఎవరికి సమాచారం ఇచ్చి నల్లాల ఓదెలును కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్టు అదిలాబాద్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పార్టీని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇటీవల పీజేఆర్ కూతురు విజయారెడ్డి సైతం టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆమె చేరిక తరువాత ఖైరతాబాద్ టికెట్ వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ సీటు నంచి గతంలో పోటీ చేసిన దాసోజు శ్రవణ్ మరోసారి ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే సీటు ఈసారి తనకు దక్కుతుందని రోహన్ రెడ్డి అనే కాంగ్రెస్ నేత సైతం భావిస్తున్నారు. అలాంటిది ఉన్నట్టుండి విజయారెడ్డి పార్టీలోకి రావడంతో.. ఈ సీటు వీరికి దక్కే అవకాశం లేవనే చర్చ సాగుతోంది. ఈ గొడవ జరుగుతుండగానే పార్టీ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేత దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరారు. ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి అసమ్మతి రాగం వినిపించడంతో కాంగ్రెస్‌లో పరిస్థితులు అల్లకల్లోలం అయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Revanth Reddy, TS Congress