తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు, హైదరాబాద్ కు చెందిన ప్రజాప్రతినిధులు భేటీ అయినట్లు తెలుస్తుంది. అయితే వీరి అత్యవసర భేటీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల క్యాసినో కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టార్గెట్ గా ఈడీ రైడ్స్ జరిగాయి. ఇక నేడు మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరగడం ఇప్పుడు మిగతా నేతలను కలవర పెడుతుంది. ఈ క్రమంలోనే నేతలు భేటీ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశం తరువాత కేంద్ర దర్యాప్తు సంస్థలపై టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఎటాక్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఐటీ రైడ్స్ పై స్పందించిన తలసాని..
సమావేశం అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. తప్పు చేసిన వాళ్లు భయపడతారు. వ్యవస్థలు ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో మా చేతుల్లోకి వస్తాయి. ఈనెల 27న 15 నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధుల జనరల్ బాడీ సమావేశం తెలంగాణ భవన్ లో నిర్వహిస్తాం అన్నారు. అలాగే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ పై ఆయన స్పందించారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. చర్యకు ప్రతిచర్య వుంటుంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని దెబ్బ తేయాలనుకోవడం బాధాకరం అని తలసాని అన్నారు.
మల్లారెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో మెరుపు దాడులు..
ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఇవాళ ఉదయం 5 గంటలకు మెరుపు దాడులు చేసినట్లు తెలుస్తుంది. మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలతో పాటు అతని కుమారుడు, అల్లుడు ఇళ్లలోనూ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో, విద్యాసంస్థల్లో, ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబసభ్యుల ఫోన్ లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఎవరిని బయటకు పంపించడం కానీ బయటి వ్యక్తులను లోపలికి పంపించడం లేదు. ఈ సోదాల్లో భాగంగా బాలానగర్ లో క్రాంతి బ్యాంక్ లో మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు తెలియగా ఆ బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. సుమారు 6 గంటల నుంచి రైడ్స్ జరుగుతుండగా ఇవి సాయంత్రం వరకు కంటిన్యూ అయ్యేలా కనిపిస్తున్నాయి. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
తలసానికి బిగుస్తున్న ఉచ్చు?
కాగా ఇటీవల మంత్రి తలసాని బ్రదర్స్ కు అలాగే తలసాని PAకు క్యాసినో కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదు నిన్న తలసాని కుమారుడు సాయికిరణ్ కు కూడా అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో అతడిని విచారించిన అధికారులు లభించిన సమాచారం మేరకు వీరికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసులో మంత్రి తలసానికి కూడా సంబంధాలు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, Hyderabad, Telangana, Trs, TRS leaders