తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం మరోసారి జోరందుకుంది. అయితే ఈసారి ఆ ప్రచారానికి బలమైన కారణం ఉంది. ఇటీవల రాష్ట్రంలో కొలువుల జాతర నడుస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. TSPSC నుంచి దాదాపు అన్ని నోటిఫికేషన్లు వచ్చాయి. ఇక ఇటీవల పోలీస్ అభ్యర్థుల ఫైనల్ ఎగ్జామ్ తేదీ ఖరారు అయింది. అయితే గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. ఈసారి మాత్రం ముందస్తుకు వెళ్లేది లేదని కేసీఆర్ బల్ల గుద్ది మరీ చెప్పుకొచ్చారు. అయినా కానీ ముందస్తు ఎన్నికలపై ప్రచారం ఆగడం లేదు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంటూనే ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది.
సర్కార్ పై ఆగ్రహంతో నిరుద్యోగ యువత..
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే నిరుద్యోగ సమస్య ప్రతిపక్షాలకు ఆయుధంగా మారకూడదనే ఉద్దేశ్యంతో కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు జోరుగా చర్చ నడుస్తుంది. జాబ్ నోటిఫికేషన్ల రిలీజ్ తో నిరుద్యోగుల అసంతృప్తిని తమకు తిరిగి అనుకూలంగా మార్చుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారకుండా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
దూకుడు పెంచిన ప్రతిపక్షాలు..
కాగా ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి. బీజేపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ మిషన్ 90 తో ఏడాదిపాటు కార్యక్రమాలను నిర్ణయించారు. ఇక కాంగ్రెస్ కూడా జనవరి 26 నుండి పాదయాత్ర చేపట్టబోతున్నారు. మరోవైపు YSRTP అధినేత్రి షర్మిల కూడా సంక్రాంతి తరువాత పాదయాత్ర పునఃప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.
కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి?
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని పార్టీ కార్యనిర్వాహక సభలో కేసీఆర్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ మాటలకు అర్ధాలే వేరులే అన్న చందంగా ప్రతిపక్షాలు కేసీఆర్ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లను అని చెప్పారంటే పక్కా వెళ్తారని పలువురు నాయకులు జోస్యం చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టు వరుస జాబ్ నోటిఫికేషన్లు చూస్తుంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే భావన కలుగుతుంది. మరోవైపు కేసీఆర్ 6 నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్తారని పలువురు రాజకీయ నాయకులూ అభిప్రాయపడుతున్నారు. మరి నిరుద్యోగ యువత అసంతృప్తిని నోటిఫికేషన్ల అస్త్రంతో కేసీఆర్ ముందస్తుకు వెళ్తారా లేక షెడ్యూల్ ప్రకారమే వెళ్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Elections, Telangana, Telangana Politics