తెలంగాణలో మునుగోడు (Munugodu) హీట్ మామూలుగా లేదు. రాష్ట్రంలో (భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra), టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో దేశ రాజకీయాలు తెలంగాణ చుట్టే తిరుగుతున్నాయి. ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు బీజేపీ (Bjp), కాంగ్రెస్ (Congress), టీఆర్ఎస్ (Trs) క్యాడర్ అంతా మునుగోడు (Munugodu)లోనే మకాం వేశారు. పొద్దున నుండి రాత్రి వరకు ఓటర్లను కలుస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని సామాజిక వర్గాల ఓటు బ్యాంకును తమ వైపు డైవర్ట్ చేసుకునేలా నేతలు నేతలు ఆత్మీయ సభలు నిర్వహిస్తున్నారు.
అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రెండు అధికార పార్టీలైన బీజేపీ , టీఆర్ఎస్ ప్రచారంలో వెనకబడ్డాయనే చెప్పుకోవాలి. టిఆర్.ఎస్, బీజేపీ పోటాపోటీ విమర్శలు, ఆరోపణలు, ప్రమాణాలతో రోజులు గడిచిపోతున్నాయి. వచ్చే నెల 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా అంతకు ముందుగానే నవంబర్ 1న సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనితో కాంగ్రెస్ పార్టీ ఈ 3 రోజులను అత్యంత కీలకంగా తీసుకుంది. ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవాలని అందుకు తగ్గట్టు పావులు కదుపుతుంది.
ఓ వైపు భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)ను, అటు మునుగోడు బైపోల్ ప్రచారాన్ని కాంగ్రెస్ బ్యాలెన్స్ చేసుకుంటుంది. అందులో భాగంగా ఓ టీం భారత్ జోడో యాత్రలో మరో టీం మునుగోడు (Munugodu) ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌజ్ వ్యవహారంలో మునిగి తేలుతున్నారు. దీనిని అవకాశంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ గ్యాప్ లో 3 రోజుల్లో విస్తృతంగా ప్రచారం చేసి ఈ కీలక సమయాన్ని అన్ని విధాలా ఉపయోగించుకోవాలని చూస్తుంది. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ మునుగోడు ప్రచారానికి రానున్నారు. అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ సెక్రెటరీ, ఎమ్మెల్యే దిద్దిళ్ల శ్రీధర్ బాబు భారత్ జోడోను విడిచి మునుగోడు (Munugodu) బాట పట్టనున్నారు. అంతేకాదు మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని అధికార టీఆర్ఎస్ పార్టీ చెప్పడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీనిని అలాగే కొనసాగిస్తూ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
మొన్నటివరకు నామమాత్రంగానే ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ఇప్పుడు అంతకు రెట్టింపు వేగంతో షురూ చేసింది. ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి 60 ఎకరాల్లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఇందులో ఒకేసారి 600 మందితో సమావేశానికి వీలయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇరు పార్టీలు తలమునకలు కాగా ఇదే అదునుగా భావించి మునుగోడులో జెండా పాతాలని కాంగ్రెస్ భావిస్తుంది. కాగా మునుగోడు (Munugodu) కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఫామ్ హౌజ్ వ్యవహారం తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కు కలిసొస్తుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.