TS POLITICS DISPUTE BETWEEN TRS LEADERS IN HUZURABAD MAY HURT KCR AMBITION OF DEFEATING ETELA RAJENDAR IN NEXT ELECTIONS AK
Etela Rajendar| KCR: ఈటల విషయంలో కేసీఆర్ కోరిక తీరదా ?.. టీఆర్ఎస్ నేతలే అందుకు కారణమా ?
కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
Telangana Politics: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ను ఎదిరించి గెలిచిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మధ్య పెరుగుతున్న గ్యాప్ రాబోయే ఎన్నికల్లో కూడా కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన హుజూరాబాద్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మాజీమంత్రి ఈటల రాజేందర్. ఈటలను(Etela Rajendar) ఓడించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ.. అది సాధ్యంకాలేదు. స్వయంగా సీఎం కేసీఆర్(KCR) రంగంలోకి దిగి అక్కడ పరోక్షంగా పార్టీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. మంత్రి హరీశ్ రావు(Harish Rao) అక్కడే ఉండి ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ.. బీజేపీ తరపున బరిలో నిలిచిన ఈటల రాజేందర్ విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో అయినా ఈటలను ఓడించాలని టీఆర్ఎస్ భావిస్తుంటే.. అక్కడ టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు అలాంటి పరిస్థితి లేకుండా చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు టీఆర్ఎస్లో మొదటి నుంచి పని ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపింది టీఆర్ఎస్.
గతంలో ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఇంత చేసినా.. హుజురాబాద్‌లో మాత్రం ఈటల రాజేందర్‌ను ఓడించలేకపోయింది తెలంగాణ అధికార పార్టీ. అయితే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు మారతాయని భావిస్తున్న టీఆర్ఎస్ ఆశలు నెరవేరే అవకాశం లేదని తెలుస్తోంది. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ముఖ్యనేతల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈటలపై పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయనే వాదన వినిపిస్తోంది.
శ్రీరామనవమికి ఇల్లంతుకుంట రాములోరి ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఈ ఇద్దరు పోటీ పడుతున్నారని.. ఈసారి ఇద్దరిలో అవకాశం ఎవరికి దక్కుతుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అవకాశం ఎవరికి దక్కినా.. హుజూరాబాద్ టీఆర్ఎస్లో పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని ఈ ఎపిసోడ్ బయటపెడుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఈటల రాజేందర్‌ను ఓడించాలంటే.. ఎంతో ఐక్యంగా ఉండాల్సిన టీఆర్ఎస్ నేతలు మధ్య ఈ రకంగా విభేదాలు నెలకొంటే ఎలా అని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం కూడా ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఏ ఒక్కరికి టికెట్ దక్కినా.. మరో నాయకుడి వర్గం టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తుందా ? అన్నది సందేహమే అని చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ను ఎదిరించి గెలిచిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మధ్య పెరుగుతున్న గ్యాప్ రాబోయే ఎన్నికల్లో కూడా కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.