TS POLITICS DID KCR GIVE A CHANCE TO TWO RAJYA SABHA MP SEATS ON BEHALF OF TRS IN KHAMMAM DISTRICT FOR THIS REASON KMM PRV
TRS party: ఆ జిల్లాలో ఇరువురికి రాజ్యసభ టిక్కెట్లు.. ఖమ్మంలో కేసీఆర్ వ్యూహం ఇదేనా?
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
ముందస్తు అంటూ ఎప్పటి నుంచో ఎన్నికల పాట పాడుతున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన టీంను సిద్ధం చేశారా..? తన వ్యూహంలో భాగంగానే ఎన్నికల సన్నాహక బృందాన్ని సిద్ధం చేస్తున్నారా..?
ముందస్తు ముందస్తు అంటూ ఎప్పటి నుంచో ఎన్నికల పాట పాడుతున్న టీఆర్ఎస్ (TRS) అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) తన టీంను సిద్ధం చేశారా..? తన వ్యూహంలో భాగంగానే ఎన్నికల సన్నాహక బృందాన్ని సిద్ధం చేస్తున్నారా..? అర్థబలం, అంగబలం ఉన్న నేతలను ఎక్కడికీ పోకుండా ముందస్తుగా ముక్కు తాడేస్తున్నారా..? అంటే అవునన్నదే తెరాసలోని శ్రేణుల మాట. ఈసారి అయినా ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మెజారిటీ సీట్లను గెల్చుకుని గులాబీ జెండాను ఎగరేయాలన్న సీఎం కేసీఆర్.. తన ఆశ నెరవేర్చుకోడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దీన్లో భాగంగానే తాజాగా ప్రకటించిన రాజ్యసభ సీట్లలో (Rajya sabha seats) మూడు ఖాళీల్లో రెండు స్థానాలకు ఖమ్మం జిల్లాకు చెందిన వారినే ఎంచుకున్నారు. ఒకరు ఫార్మా రంగంలో ప్రసిద్ధిగాంచిన హెటెరో పార్ధసారథిరెడ్డి (Hetero Parthasarathy Reddy) కాగా.. మరొకరు గ్రానైట్ రంగంలో పేరు సంపాదించిన వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravi chandra) అలియాస్ గాయత్రి రవి ఉన్నారు. వీరిలో ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. మరొకరు మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఇలా రెండు ప్రధాన వర్గాలను టార్గెట్ చేయడం ద్వారా సీఎం కేసీఆర్ తన అజెండాను స్పష్టంగా చాటుకుంటూ సంకేతాలను పంపినట్లయింది. ఇది రాజకీయంగా ఏమేరకు ఆశించిన ఫలితాలను అందిస్తుందన్నది వేరే విషయం.
కేసీఆర్ ఇక్కడ ఉండగానే ప్రత్యేక తెలంగాణ..
తొలి నుంచి తెలంగాణ (Telangana) వాదానికి పెద్దగా బేస్‌లేని ఖమ్మం జిల్లాకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1969లో సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అయినా.. 2001లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం స్థాపితమైన తెరాస ఉద్యమంలోనూ ఖమ్మం జిల్లాది కీలక స్థానం. రాష్ట్ర సాధన కోసం తెరాస అధినేత కేసీఆర్ తన నిరవధిక దీక్షతో ప్రాణత్యాగానికి సిద్ధపడింది ఇక్కడే. ఇక్కడి జైలుకు తరలించి.. ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలోనే ఉంచారు. కేసీఆర్ ఇక్కడ ఉండగానే కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇలా ఉద్యమంలోని ప్రతి మైలురాయిలోనూ తనదైన స్థానాన్ని నిలబెట్టుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండాల్సినంత బలంగా లేమన్నది సీఎం కేసీఆర్ భావన.
ఆ మేరకు ఫలితాలు (results) కూడా రాలేదన్నది నిజమే. రాష్ట్ర సాధన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో కేవలం కొత్తగూడెం (Kothagudem) స్థానంలో మాత్రమే తెరాస గెలుపొందింది. మిగిలిన సీట్లలో కనీసం గౌరవ ప్రదమైన ఓట్లను సాధించలేకపోయింది. దీంతో నిరాశకు గురైన కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని వ్యవస్థీకృతం చేయడానికి అనేక ప్రయోగాలు చేసుకుంటూ వచ్చారు. దీన్లో భాగంగానే తనకు పాత సన్నిహితుడైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించి, మంత్రి పదవి కట్టబెట్టారు.
దీంతోపాటుగా అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలను, ఇంకా ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన పువ్వాడ అజయ్‌కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ఒకప్పటి కాంగ్రెస్, తెదేపా, వైసీపీల్లోని ఉద్దండులు అందరూ ఒకే గూటికి చేరారు.
వచ్చే ఎన్నికల్లోనైనా..
తిరుగులేని బలంతో గత ఎన్నికల బరిలోకి దిగిన తెరాసకు ఫలితాలు మింగుడుపడని స్థితికి చేర్చాయి. 2014 ఎన్నికలలో కొత్తగూడెం ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న తెరాస, 2018 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కేవలం ఖమ్మం స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి లోనైన సీఎం కేసీఆర్ తమ కత్తులే తమకు గుచ్చుకున్నట్టు సైతం పేర్కొన్నారు. దీంతో ఉద్దండులైన నేతలను సైతం సీఎం కేసీఆర్ కొంతకాలం పాటు కలవడానికి ఇష్టపడలేదన్నదీ నిజమే. ఇక వచ్చే ఎన్నికల్లోనైనా (Next elections) ఇక్కడ తిరుగులేని ఫలితాలను సాధించే క్రమంలో ఇప్పటి నుంచే అవసరమైన చికిత్సను మొదలుపెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ లోటును భర్తీ చేసుకోడానికే..
దీన్లో భాగంగానే ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం నుంచి హెటెరో డ్రగ్స్ బండి పార్ధసారధిరెడ్డి, బీసీ కేటగిరీకి చెందిన మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన గాయత్రిరవిని ఎంచుకున్నారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న గాయత్రి రవి వల్ల అనుకున్న స్థాయిలో ఉపయోగం ఉండడం సాధ్యమవడానికి ఛాన్స్ ఉన్నప్పటికీ, స్థానిక జిల్లా ప్రజలతో పెద్దగా చెప్పుకోదగిన సంబంధాలు లేని హెటెరో డ్రగ్స్ బండి పార్ధసారధిరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇవ్వడం వల్ల ఒరిగేదేమీ లేదన్నది ఓ పరిశీలన. కాకపోతే ఆర్ధిక వనరులు సమకూర్చడంలో లోపం ఉండకపోవచ్చు. బహుశా తెరాస అధినేత ఈ లోటును భర్తీ చేసుకోడానికే ఈ ప్రయోగానికి సిద్ధమైనట్టు చెప్పుకోవచ్చు.
దీంతో వచ్చే ఎన్నికలను ఫేస్ చేయడానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఇంకా ఇతర ఎమ్మెల్యేలు సహా కొత్తగా టీంలో జాయిన్ అయిన వారితోనే ఎన్నికల సమరానికి సన్నద్ధం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజాబలం పుష్కలంగా ఉండి, నిత్యం జనంతో మమేకం అవుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల ప్రస్తావన ఈ సందర్భంగా అధినేత నుంచి రాకపోవడం తెరాస శ్రేణుల్లో ఆశ్చర్యం, ఆలోచన, చర్చకు దారితీస్తోంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.