తెలంగాణలో టీఆర్ఎస్(TRS) సీనియర్లకు బీజేపీ గాలం వేస్తోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ డిప్యూటీ స్పీకర్,టీఆర్ఎస్ సీనియర్ నేత పద్మారావు గౌడ్ (Padmarao goud)సైతం బీజేపీ(BJP)లోకి వెళ్తున్నారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని ..కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు పద్మారావుగౌడ్. తాను టీఆర్ఎస్ అసంతృప్తిగా ఉన్నానని, కేసీఆర్‌తో సత్సంబంధాలు తెగిపోవడం పూర్తిగా అబద్ధమన్నారు. తన ప్రాణమున్నంత వరకు టీఆర్ఎస్లోనే ఉంటానని కేసీఆర్(KCR) ఫ్యామిలీతోనే కొనసాగుతానని పద్మారావుగౌడ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తానని చెప్పిన ఆయన కిషన్‌రెడ్డి (Kishanreddy)ని కలవడం వెనుక అసలు విషయం చెప్పారు.
టీఆర్ఎస్ను వదలని..బీజేపీలో చేరను..
టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడంతో ఇంకా చాలా ఆయన బాటలోనే ఉన్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరో మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరబోతున్నారని చెప్పడంతో పార్టీ సీనియర్లలో చాలా మంది బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అందులో ఒకరే డిప్యుటీ స్పీకర్ పద్మారావుగౌడ్. ఆయన బీజేపీలో చేరబోతున్నారని ..అందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పద్మారావుగౌడ్ ఇంటికి వెళ్లిన విషయాన్ని అడ్డుపెట్టుకొని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ ప్రచారానికి తెర దించారు పద్మారావుగౌడ్. తాను పార్టీలో సంతృప్తిగానే ఉన్నానని .. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు.
కేసీఆర్ ఫ్యామిలీతోనే నేను..
ఇక కేసీఆర్‌తో సత్సంబంధాలు లేవనే ఆరోపణలను పద్మారావు గౌడ్ ఖండించారు. తన ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబంతోనే కొనసాగుతానని కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేస్తారు, మరచిపోతారని అనుకుంటారు అంతా ... కానీ తాను ఎన్నికల వాగ్దానాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అందులో భాగంగానే తన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధనల వల్లే మునుగోడుకు వెళ్లలేదన్నారు.
కిషన్‌రెడ్డితో ఫ్రెండ్షిప్ అంతే ..
బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలవడంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు పద్మారావుగౌడ్. కిషన్ రెడ్డితోను తనకు మంచి రిలేషన్ ఉందన్నారు. అంతే కాదు ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో అసెంబ్లీలో కూడా పక్క పక్కనే కూర్చున్న విషయాన్ని గుర్తు చేశారు. పద్మారావుగౌడ్‌ను కలవడంపై కిషన్‌రెడ్డి సైతం వివరణ ఇచ్చారు. పద్మారావుగౌడ్ కుమారుడి వివాహానికి హాజరు కాని కారణంగా ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేసి తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఇక పద్మారావుగౌడ్ తాను వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని ..మునుగోడులో గెలిచేది కూడా టీఆర్ఎస్సేనంటూ క్లారిటీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.