తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపుతున్నాయి. రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని ఆయన అనుచరులు, మద్దతుదారులు చెబుతుంటే.. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. అసలు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ వ్యవహారంపై మౌనంగా ఉండటం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర (Padayatra) ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క సహా అనేక మంది నేతలు రేవంత్ రెడ్డి పాదయాత్ర వైపు చూడటం లేదు. రెండు నెలల పాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో ఆయన పాదయాత్రకు సీనియర్ నేతలు మద్దతు లేకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లతో(Congress party senior leaders) ఉన్న విభేదాలకు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సీనియర్ నేతలెవరూ ఆయన పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి వెళ్లలేదు. ఆయనతో కలిసి పాదయాత్రలో నడవాలనే ఆలోచన కూడా సీనియర్ నేతలెవరికీ కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా నిలిచి.. ఆయనతో కలిసి నడిచి ఉంటే.. ఇప్పుడు పరిస్థితి మరో రకంగా ఉండేదనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది.
కానీ రేవంత్ రెడ్డి అంటే ఏ మాత్రం పొసగని సీనియర్ నేతలు పాదయాత్ర విషయంలో ఆయనకు సహకరిస్తారని ఎవరూ భావించడం లేదు. అయితే రాబోయే రోజుల్లోనూ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇదే రకంగా కొనసాగితే.. ఆయన యాత్ర ఉద్దేశ్యం నెరవేరే అవకాశం ఉంటుందా ? అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి అంటే పొసగని నేతలు.. తమ నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్రకు ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా సస్పెన్స్‌గా మారింది.
Kondagattu: హనుమాన్ భక్తులకు శుభవార్త.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు..!
ములుగులో రేవంత్ పాదయాత్ర.. కేసీఆర్ పై వివాదాస్పద కామెంట్స్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ నాయకత్వం కలిసికట్టుగా పని చేసింది. ఇందుకోసం ఆ పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు కూడా ఎంతో చొరవ తీసుకుంది. కానీ రేవంత్ రెడ్డి పాదయాత్ర మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అనుమతి ఉన్నా.. బీజేపీ స్థాయిలో వాళ్లు వ్యవహరిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల మద్దతు కరువైన రేవంత్ రెడ్డి పాదయాత్ర రాబోయే రోజుల్లో ఏ విధంగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana