మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ విదేశాలకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరిగొచ్చారు. నల్లగొండలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయబోనంటూ విదేశాలకు వెళ్లిపోయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నిక పూర్తయిన తరువాతే మళ్లీ ఇండియాకు తిరిగొస్తారనే వార్తలు వచ్చాయి. కానీ మునుగోడు(Munugodu) ఉప ఎన్నికకు కొద్దిరోజుల గడువు ఉండగానే ఆయన తిరిగి రావడంతో.. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల క్రితం తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి (Komatireddy Venkat Reddy) షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది. ఉప ఎన్నికలు పూర్తయిన తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై స్పందిస్తారని చాలామంది భావించారు.
కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇండియాకు తిరిగి రావడంతో.. మునుగోడు ఉప ఎన్నికకు ముందే ఆయన ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తారు ? కాంగ్రెస్ను ఇబ్బందిపెట్టేలా మళ్లీ ఏమైనా కామెంట్స్ చేస్తారా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. మరోవైపు తెలంగాణలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) భారత్ జోడో పాదయాత్ర సాగుతుండటంతో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ పాదయాత్రలో పాల్గొంటారా ? లేక షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేవరకు పాదయాత్రకు కూడా దూరంగా ఉంటారా ? అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ , బీజేపీలను ఎదుర్కోవడంలో చాలావరకు వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీకి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించాయి. అయితే మునుగోడు ఉఫ ఎన్నికలు పూర్తయ్యేవరకు విదేశాలకు వెళతానని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మరో రెండు రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న సమయంలో ఇండియాకు తిరిగి రావడంతో.. ఆయన మళ్లీ ఏ విధంగా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది.
Munugodu Violence: బీజేపీకి పరిస్థితి అర్థమైంది.. అందుకే దాడులు చేస్తున్నారన్న హరీశ్ రావు
మరోవైపు రాహుల్ గాంధీ పాదయాత్ర మరికొద్దిరోజుల పాటు తెలంగాణలో కొనసాగనున్న నేపథ్యంలో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనను కలుస్తారా ? ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొంటారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాహుల్ గాంధీని కలిస్తే.. పార్టీతో ఆయనకు ఉన్న సమస్యలు దాదాపుగా పరిష్కారమవుతాయనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.