తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ దానిని రాజకీయ బలంగా మలుచుకోవడంలో ఇన్నాళ్లూ విఫలమవుతున్నారనే విమర్శలకు విరుగుడుగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచడం ద్వారా పునర్వైభవాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నది. ఆ క్రమంలోనే ఏఐసీసీ ముఖ్యనేత రాహుల్ గాంధీ తెలంగాణపై ఫోకస్ పెంచారు. మరికొద్ది రోజుల్లో రాహుల్ గాంధీ చేపట్టనున్న పర్యటనను తెలంగాణ కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు రోజులపాటు తెలంగాణలోనే గడపనున్న రాహుల్.. మే 6న వరంగల్ లో జరిగే ‘రైతు సంఘర్షణ సభ’లో పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు(మే 7న) హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీని ఆయన సందర్శిస్తారు. కాగా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసి, రెబల్ నేతగా ముద్రపడిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాహుల్ గాంధీ పర్యటనలో కీలక బాధ్యతలు కట్టపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ ఎదుటే జగ్గారెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్, ఓయూలో సభ ఏర్పాట్లపై సమీక్ష కోసం శనివారం ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగ్గా, అక్కడ ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మణికం ఠాకూర్ కు ముడుపులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నాడంటూ గతంలో రేవంత్ రెడ్డిని దారుణంగా తిట్టిపోసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రస్తుత తీరు అందరినీ ఆకట్టుకుంది. గత నెలలో రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో రేవంత్ తో విభేదాలను పరిష్కరించుకున్న జగ్గారెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడికి తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు. జగ్గారెడ్డికి ప్రత్యేక గుర్తింపుగా రాహుల్ గాంధీ ఓయూ సందర్శన కార్యక్రమ బాధ్యతలను పార్టీ కట్టబెట్టింది.
ఓయూలో రాహుల్ కార్యక్రమానికి ఇన్‌చార్జి బాధ్యతలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డికి అప్పగించనున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించగానే నేతలు హర్షధ్వానాలు చేశారు. విభేదాలను పక్కనపెట్టి నేతలంతా ఒక్కటిగా పనిచేసి రాహుల్ సభలను విజయవంతం చేద్దామని తీర్మానించుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మైక్ అందుకొని.. రేవంత్, ఇతర నేతల ఎదుట ప్రత్యర్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..
రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనకు రాజకీయ పరమైన ఆటంకాలు ఏర్పడవచ్చనే అనుమానాల నేపథ్యంలో జగ్గారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అడ్డొస్తే తొక్కేస్తామని హెచ్చరించారు.‘కాంగ్రెస్ తొడగొడితే బీజేపీ కనపడదు, టీఆర్ఎస్ కనపడదు. వెరీ వెరీ సీరియస్.. పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్లు రాహుల్ గాంధీ కచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ వస్తారు. ఏ శక్తులూ ఆయనను అడ్డుకోలేరు. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే తొక్కిపడేస్తాం.. అంతే!’అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ సాధన పోరులో విద్యార్థి ఉద్యమాలకు కేంద్రంగా నిలిచిన ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్దకు రాహుల్‌గాంధీని తీసుకువెళ్లాలని టీపీసీసీ నేతలు తీర్మానం చేశారు. వర్సిటీలో రాహుల్ విజిట్‌కు సంబంధించి వీసీకి వినతిపత్రం ఇచ్చి.. వీసీనే కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేలా కృషి చేద్దామంటూ సమావేశంలో ప్రతిపాదించారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జిగా జగ్గారెడ్డిని నియమించారు. పలువురు ఓయూ విద్యార్థి నేతలు రేవంత్‌రెడ్డిని కలిసి రాహుల్‌గాంధీ వర్సిటీని పర్యటించేలా చొరవ తీసుకోవాలని కోరారు. మొత్తంగా జగ్గారెడ్డి-రేవంత్ రెడ్డిల మధ్య సయోధ్య పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Jagga Reddy, Osmania University, Rahul Gandhi, Revanth Reddy, Telangana