హోమ్ /వార్తలు /తెలంగాణ /

Congress | TRS: తెరాస కోటపై కాంగ్రెస్‌ పోరు షురూ.. ఆ పర్యటనలకు కారణమదేనా?

Congress | TRS: తెరాస కోటపై కాంగ్రెస్‌ పోరు షురూ.. ఆ పర్యటనలకు కారణమదేనా?

కాంగ్రెస్ గుర్తు

కాంగ్రెస్ గుర్తు

తెరాసపై (TRS) క్షేత్ర స్థాయిలో పోరాటానికి కాంగ్రెస్‌  (Congress)రంగంలోకి దిగిందా..? అందుకే ఆ జిల్లాల్లో సీఎల్పీ నేతల పర్యటనలకు షురూ చేశారా..? తమకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో పట్టు సడలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా...?

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam, India

(G. Srinivas reddy, News18, Khammam)

తెరాసపై (TRS) క్షేత్ర స్థాయిలో పోరాటానికి కాంగ్రెస్‌  (Congress)రంగంలోకి దిగిందా..? అందుకే ఆ జిల్లాల్లో సీఎల్పీ నేతల పర్యటనలకు షురూ చేశారా..? తమకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో పట్టు సడలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా...? అంటే అన్నిటికీ అవునన్నదే సమాధానంగా ఉంది. మరో ఏడాదిన్నర తర్వాత ఎన్నికలు ఉండగానే.. ఉమ్మడి ఖమ్మం  (Khammam) జిల్లాపై కాంగ్రెస్‌ పార్టీ పట్టుబిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీన్లో భాగంగానే దుమ్ముగూడెం ప్రాజెక్టులో అసలేం జరుగుతోందన్న దానిపై నిజ నిర్ధరణ కోసం అన్నట్టు సీఎల్పీ (CLP) బృందం అకస్మాత్తుగా పర్యటనకు పూనుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఉన్న ప్రాజెక్టు ఇన్‌టేక్‌వెల్‌ సహా పంప్‌హౌస్‌ను సందర్శించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీనికి ముందుగా సీఎల్పీ బృందం గోదావరి వరద తాకిడికి బురదమయంగా మారిన ప్రాంతాల్లో పర్యటించడానికి సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బృందంలోని సభ్యులైన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క సహా మరికొందరు నేతలు తమ నిరసనను తెలుపుతూ వెనుదిరిగారు.

అసలేంటీ దుమ్ముగూడెం కథ.. ?

గోదావరి నది నుంచి ఏటా వృథాగా పోతున్న వరద నీటిని సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికి దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్‌గా పేరు పెట్టారు. ఇక్కడి నుంచి భారీ పైప్‌లైన్‌ ద్వారా గోదావరి నీటిని పాలేరు జలాశయానికి తరలించడం ఈ ఎత్తిపోతల పథకం లక్ష్యం. తద్వారా ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో కృష్ణా జలాల ద్వారా సాగవుతున్న ఆయకట్టును స్థిరీకరించడం.. ఇంకా కొత్త ఆయకట్టును పెంచడం.. దీంతోపాటు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కృష్ణా డెల్టాకు ముందస్తుగా సాగునీరు అందించడం ద్వారా.. ఏటా నవంబరులో వచ్చే తుఫాన్లకు వరిపొలాలు నష్టపోకుండా నివారించడం లక్ష్యంగా అప్పట్లో ఈ ఎత్తిపోతల సాగునీటి పథకానికి రూపకల్పన చేశారు. దీనికోసం భారీగా భూసేకరణ చేసి.. పైప్‌లైన్లు వేయడం దాదాపు చివరి దశకు చేరుకుంది.

మారిన పరిస్థితుల్లో ప్రభుత్వాల ప్రాధాన్యాలు మారడం.. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్‌ (KCR) నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రీఇంజినీరింగ్‌ కు రూపకల్పన చేశారు. దీన్లో భాగంగా అప్పట్లో పైప్‌లైన్లుగా ఉన్న దాన్ని భారీ కాల్వలుగా మార్చారు. మధ్యమధ్యలో లింక్‌ రిజర్వాయర్లను నిర్మించడం ద్వారా అదనంగా ఆయకట్టును ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వచ్చింది. అయతే ప్రాజెక్టు పేరును అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్‌గా పెట్టగా.. తెరాస ప్రభుత్వం దీన్ని సీతారామ ఎత్తిపోతల పథకంగా మార్చింది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతూ వస్తున్నారు.

Congress: తారాస్థాయికి తెలంగాణ కాంగ్రెస్​ రాజకీయాలు.. సోనియా వద్దకు కోమటిరెడ్డి, మర్రి?

ప్రాజెక్టు పేరు మార్చడం సహా, రీ ఇంజినీరింగ్‌ పేరిట భారీగా అవినీతి చోటు చేసుకుంటోందన్నది కాంగ్రెస్‌ నేతల ఆరోపణ.  దీనికితోడు ఈ మధ్యన వచ్చిన వరదల వల్ల కాళేశ్వరంలో పంప్‌హౌస్‌ నీటమునగడంతో.. దానిలాగానే ఇక్కడ కూడా పరిస్థితి ఉందా అన్న సందేహంతో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సీఎల్పీ పూనుకుంది. ఇది ఓ ఎత్తయితే.. గోదావరి వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని.. ఇప్పటికీ బురద ప్రాంతాలతో ఇక్కట్లు పడుతున్నారని.. ప్రజలను పరామర్శించడానికి నేతలు క్షేత్రస్థాయికి చేరుకున్నారు.

తమకు గట్టి పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు జారకుండా చూసుకోవడం.. వచ్చే ఎన్నికల్లో అదే స్థాయి ఫలితాలను ఇక్కడ రాబట్టుకోవడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నది వ్యూహంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలో ఒక స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అది చెదరకుండా ఇప్పటి నుంచే వ్యూహప్రతివ్యూహాలకు పదును పెట్టిందని చెప్పొచ్చు.

First published:

Tags: Congress, Khammam, Telangana, Telangana Politics, Trs