టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై(KCR) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలోని సుమారు 25 మంది కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ మాట్లాడారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. వారిని ఫామ్ హౌజ్ కు పిలిచి మాట్లాడారని అన్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలిసిందని అన్నారు. ఆ నేతలకు రూ.500 కోట్ల ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం తెలిసి తమ నేతలకు సైతం ఏఐసీసీ క్లాస్ తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. సునీల్ కనుగోలు(Sunil Kanugolu) రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తక్కువ మార్జిన్‌తో గెలిచే నేతలను టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ ఈ పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయం కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామికి కూడా తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ మీటింగ్‌కు కుమారస్వామి(Kumaraswamy) రాకపోవడానికి అదే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
ఇక నిజాం రాజు అంతక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరిపించడాన్ని తప్పుపట్టే వారిని రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాంటి వారిని మానసిక అంగవైకల్యం కలవారని భావించాలని అన్నారు. పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌లో ఎనిమిదో నిజాం బర్కత్ అలీఖాన్ ముకరం ఝా బహదూర్ పార్థివదేహానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్దిస్తుందని తెలిపారు. నిజాం రాజులు సృష్టించిన సంపదను తెలంగాణ ప్రభుత్వం అమ్మేస్తుందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో విలువైన భూములను వేలానికి పెట్టారని మండిపడ్డారు.
Khammam: కంటి వెలుగు సభలో భట్టి విక్రమార్క.. జాతీయ నేతలకు పరిచయం చేసిన సీఎం కేసీఆర్
ఖమ్మం సభకు ఏపీ నుంచి ప్రత్యేక బస్సులు.. ఏయే జిల్లాల నుంచంటే ?
తెలంగాణ ప్రభుత్వం అందరు గర్వించేలా ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టాలని.. దానికి ముకరంజా పేరు పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎలాంటి కార్యక్రమం చేపట్టాలనే విషయాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం అందరితో చర్చించాలని కోరారు. నిజాం కాలంలో రాజులు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. కొన్ని తప్పులు కూడా జరిగాయని, వాటిని కాంగ్రెస్ పార్టీ సమర్దించదని అన్నారు. 8వ నిజాం రాజు మరణించడం బాధాకరమని.. నిజాంరాజులు హైదరాబాద్‌ను ఎంతో వృద్ధి చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఉస్మానియా, నిలోఫర్, కోరంటి, దవఖానాలు, ఉస్మానియా కాలేజీ నిర్మాణం చేసిన ఘనత నిజాం రాజులదని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Revanth Reddy, Telangana