వచ్చే నెలలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వరంగల్‌లో బహిరంగ సభలో పాల్గొనబోతున్న రాహుల్ గాంధీ.. ఆ మరుసటి రోజు పార్టీ నాయకులతో హైదరాబాద్‌లో సమావేశం కాబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో దాదాపు 40 మంది నాయకులతో సమావేశమైన రాహుల్ గాంధీ.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు పక్కనపెట్టి.. అంతా కలిసికట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని వారికి సూచించారు. తాను ఎఫ్పుడు రమ్మని పిలిస్తే.. అప్పుడు రాష్ట్రానికి వస్తానని రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో తెలంగాణకు రాబోతున్న రాహుల్ గాంధీ.. పార్టీ నేతలు ఏ విధంగా రాష్ట్రంలో ముందుకు సాగాలనే అంశాలపై బ్లూ ప్రింట్ తీసుకురాబోతున్నారనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒకటి. అయితే కొంతకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) బలహీనపడుతుండటంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ హైకమాండ్.. మళ్లీ ఇక్కడ పుంజుకోవడంపై ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రోడ్ మ్యాప్ సిద్ధం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం తెలంగాణ(Telangana) నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ.. వారికి సునీల్‌ను పరిచయం చేశారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలతో సునీల్ టచ్‌లో ఉంటారని తెలిపారు.
ఇక తన టీమ్‌తో రాష్ట్రంలో సర్వే చేయిస్తున్న సునీల్ కనుగోలు.. రాష్ట్రంలో మళ్లీ పార్టీ బలోపేతం కావడంతో పాటు బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్ అడ్డుకోవాలంటే ఏం చేయాలనే దానిపై రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పలువురు కీలక నేతలు ఉన్నారు. అయితే వారి మధ్య సఖ్యత పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని.. దీనిపై ఢిల్లీ స్థాయిలో కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.
ఒకరి పనిలో మరొకరు వేలు పెట్టకుండా ఎవరెవరు ఏ పని చేయాలనే దానిపై కాంగ్రెస్ నాయకత్వం త్వరలోనే నాయకులకు క్లారిటీ ఇవ్వనుందని.. బహుశా రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సమయంలోనే దీనిపై ఓ క్లారిటీ రావొచ్చని ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలోని కీలక నేతలకు వివిధ బాధ్యతలు అప్పగించి.. వాటిని ఎఫ్పటికప్పుడు ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షించాలనే యోచనలో హైకమాండ్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే తెలంగాణకు రాబోతున్న రాహుల్ గాంధీ.. రాష్ట్ర కాంగ్రెస్ నేతల కోసం రోడ్ మ్యాప్ తీసుకొస్తారేమో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.