తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారంతో పాదయాత్రల సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో పలు విడతలుగా కొన్ని నెలల నుండి ప్రజల్లోనే ఉంటున్నారు. ఇక త్వరలోనే బస్సు యాత్ర కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోగా బీఆర్ఎస్ కార్యకర్తల దాడి, షర్మిల అరెస్టుతో పాదయాత్ర నిలిచిపోయింది. ఇక సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదంటూనే వరుస జాబ్ నోటిఫికేషన్లు వేస్తున్నారు. నిరుద్యోగుల వ్యతిరేకత ప్రతిపక్షాలకు ఆయుధంగా మారకుండా కేసీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఎన్నికలే టార్గెట్ గా పాదయాత్రపై ఫోకస్ పెట్టింది. అయితే రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్ లో దుమారం రేపినట్టు తెలుస్తుంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు AICC పర్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 26 నుండి చేపట్టాలనుకున్న హాత్ సే హాత్ జోడో యాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వలేదని మహేశ్వర్ రెడ్డి అన్నారు. AICC ఇచ్చిన సర్క్యులర్ లో 2 నెలల పాదయాత్ర ఉందని, కానీ జనవరి 26 నుండి 5 నెలల పాటు పాదయాత్ర అని అన్నారన్నారు. అయితే ఎవరి నియోజకవర్గంలో వారే పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. ఈ పాదయాత్రలో ఒకరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఇప్పటికే పేరు, ముహూర్తం ఖరారు అయిన విషయం తెలిసిందే. హాత్ సే హాత్ జోడో యాత్రగా దీనికి నామకరణం చేయగా..జనవరి 26 నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. టీపీసీసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం నుండి ప్రారంభించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభతో ముగించాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలతో పాదయాత్రపై సందిగ్ధం నెలకొంది.
కానీ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలతో అసలు రేవంత్ పాదయాత్ర ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ రేవంత్ పాదయాత్ర ఉంటే దానికి సీనియర్లు ఏ మేరకు సహకరిస్తారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. మరికొన్ని రోజుల్లో రేవంత్ పాదయాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Mp revanthreddy, Telangana