మునుగోడు ఉపఎన్నిక (Munugodu bypoll) ఫలితంపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి (Palwai Sravanti) స్పందించారు. ఉపఎన్నిక కౌంటింగ్ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ..డబ్బు, మద్యంతో మునుగోడు ఉపఎన్నిక జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, తాను చేసిన పోరాటంలో నైతిక విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటమి సహజం. కానీ ఏనాడైనా తిరిగి మునుగోడులో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని పాల్వాయి స్రవంతి (Palwai Sravanti) చెప్పుకొచ్చారు. కాగా మునుగోడు ఉపఎన్నిక (Munugodu bypoll)లో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ప్రధాన పోటీ టిఆర్ఎస్, బీజేపీ మధ్యే సాగింది. అధికార పార్టీకి కమలం గట్టి పోటీనిచ్చింది. అయితే కాంగ్రెస్ ఈ స్థాయిలో డీలా పడుతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పోటీకి చాలా దూరంలో నిలిచింది.
ఏదైనా ఎన్నికల్లో డిపాజిట్ దక్కాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం 1/6 ఓట్లు సదరు అభ్యర్థికి పోల్ అవాలి. లేనిపక్షంలో సదరు అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అయినట్టు లెక్క. మునుగోడులో(Munugodu) మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఏ అభ్యర్థి అయినా డిపాజిట్ దక్కించుకోవాలంటే 37500 ఓట్లకు పైగా తెచ్చుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సంఖ్యకు చాలా దూరంలో నిలిచిపోయింది. కానీ కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 30 వేల లోపే పరిమితమైంది.
మునుగోడు (Munugodu) ఉపఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీ విజయంఢంకా మోగించింది. బీజేపీ (BJP) అంచనాలను తలదన్నే విధంగా పది వేలకుపైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komati Reddy Rajagopal Reddy)పై టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) విజయం సాధించారు. అయితే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టిన 15 రౌండ్లలో తొలి రౌండ్లో మినహాంచి ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ మెజార్టీ పెరుగుతూ వచ్చింది.
మొదట వందల్లో పెరిగిన మెజార్టీ క్రమంగా వేలకు చేరింది. 13వ రౌండ్ వచ్చే సరికి 8976 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్ది. చివరి రౌౌండ్తో కలిపి 11,666 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీఆర్ఎస్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.