రాజ్యసభ ఎన్నికల వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అనూహ్య సందర్భంగా నిలిచింది. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులను ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ రాజ్యసభకు పంపుతుండటం.. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జఠిలంగా మార్చింది. ప్రధానంగా బీసీ సంఘాల జాతీయ నేత ఆర్.కృష్ణయ్యకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలిచిమరీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఇవ్వడం, ఉన్న నాలుగు పదవుల్లో రెండు బీసీలకే కేటాయించడంతో తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ కులం ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. ఆర్.కృష్ణయ్య రూపంలో జగన్ విసిరిన బాణం వ్యూహాత్మకమా? రాజకీయ ఒప్పందాల్లో భాగమా? అనే ప్రశ్నలు తలెత్తడంతోపాటు కేసీఆర్ మెడపై అనివార్యంగా బీసీ కత్తిని వేలాడదీసినట్లయింది. గులాబీ బాస్ ప్రకటించనున్న ముగ్గురు రాజ్యసభ అభ్యర్థుల్లో కనీసం ఒకరు బీసీ లేదా ఎస్సీని ఎంచుకోవాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగియనుండగా ఆ స్థానాలకు జూన్ 10న ఎన్నిక జరుగనుంది. తెలంగాణలో బండ ప్రకాశ్ రాజీనామాతో ఒకటి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ పదవీకాలం ముగియడంతో రెండు, మొత్తంగా మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరుగనుంది. ప్రస్తుత బలాబలాలను బట్టి ఏపీలోని నాలుగు స్థానాలూ వైసీపీకి, తెలంగాణలోని మూడు స్థానాలూ టీఆర్ఎస్ కు దక్కుతాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో ఏపీ సీఎం జగన్ అనూహ్యతను ప్రదర్శిస్తూ తెలంగాణకు చెందిన ఇద్దరికి టికెట్లిచ్చారు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు విజయసాయరెడ్డి, బీదమస్తాన్ రావు(బీసీ) ఏపీకి చెందినవారు కాగా, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి(అడ్వొకేట్)లు తెలంగాణవారు కావడం విశేషం.
ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల కు చెందిన నిరంజన్ రెడ్డి అడ్వొకేట్ గా జగన్ అక్రమాస్తులు, సీబీఐ కేసులను వాదించారు కాబట్టి ఆయన ఎంపిక సహజమనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ బీసీ సంఘాల జాతీయ నేత ఆర్.కృష్ణయ్యను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంచుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా బీసీ కులాల తరఫున పోరాడుతూ, బీసీ ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన ఆర్ కృష్ణయ్యకు జగన్ పిలిచి టికెట్ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపర్చింది. వికారాబాద్ జిల్లాకు చెందిన కృష్ణయ్య గతంలో టీడీపీ (హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ స్థానం నుంచి) ఎమ్మెల్యేగానూ పనిచేసి, తర్వాతి కాలంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఏపీలో టీడీపీని మరింత దెబ్బతీసి, వచ్చే ఎన్నికల్లోనూ బీసీల ఆదరణ పొందడానికే జగన్.. కృష్ణయ్యను ఎంచుకున్నారనే వాదన వినిపిస్తోంది. జగన్ ఆ పని చేయడానికి కారణాలు ఎలా ఉన్నా, ఈ ఎంపిక తెలంగాణలో ఒక అనివార్యతను క్రియేట్ చేసింది. అదేంటంటే..
టీఆర్ఎస్ మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాల్సి ఉండగా ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. అందులో ప్రాబబుల్స్ గా ఆరుగురిపేర్లు వినిపిస్తుండగా అందులో బీసీ నేత ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. మోత్కుపల్లి నర్సింహులు రూపంలో ఎస్సీ నేత ఒక్కరే ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న అనధికార సమాచారం ప్రకారం మొత్తం మూడు స్థానాల్లో.. ఇద్దరు అభ్యర్థులు ఖాయం అయ్యారు. కేసీఆర్ తన ఆప్తులు, అవసరం ఉన్నవాళ్లనే రాజ్యసభకు పంపాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్ కోశాధికారిగా వ్యవహరించిన ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఎండీ దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త-హెటిరో సంస్థ అధినేత పార్ధసారథిరెడ్డికి రాజ్యసభ టికెట్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఖమ్మం మాజీ ఎంపీ పొగులేటి శ్రీనివాసరెడ్డిని రెండేళ్ల ప్రాతిపదికన (బండ ప్రకాశ్ రాజీనామా చేసిన స్థానంలో) ఎంపీగా పంపుతామని టీఆర్ఎస్ హైకమాండ్ ఆఫర్ ఇచ్చినా.. కేటీఆర్‌తో పొంగులేటి సమావేశమై ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరడంతో ఖమ్మం జిల్లాకే చెందిన పార్థసారథిరెడ్డికి లైన్ క్లియరైనట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ మూడో సీటును నటుడు ప్రకాశ్ రాజ్ కు కేటాయించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. అదే జరిగితే ముగ్గురు అభ్యర్థులు దామోదర్ రావు (వెలమ), పార్థసారథి (రెడ్డి), ప్రకాశ్ రాజ్ (క్షత్రియ శెట్టి) అగ్రకులాలకు చెందినవారవుతారు. ఓవైపు ఏపీలో జగన్ 50 శాతం టికెట్లు బీసీలకు ఇవ్వడం, అందునా బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్యకు చోటుకల్పించడంతో కేసీఆర్ తన ఈక్వేషన్లను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
రెండేళ్ల పదవీ కాలానికిగానూ ఎస్సీ నేత మోత్కుపల్లి నర్సింహులును లేదా బీసీ నేతలైన నారదాసు లక్ష్మణ్ రావు, పీఎల్ శ్రీనివాస్ లో ఒకరిని సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేయొచ్చన్నది తాజా సమాచారం. కృష్ణయ్య ఎఫెక్ట్ వల్లే టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఫైనల్ టాప్-3 ప్రాబబుల్స్ లో కచ్చితంగా ఒక బీసీ లేదా ఎస్సీ నేత పేరు చేర్చాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా, కేసీఆర్ తో ఒప్పందంలో భాగంగానే జగన్ తెలంగాణ నేతలకు రాజ్యసభ అవకాశం కల్పించారనే ఊహాతీత కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో బుధవారం సాయంత్రం లేదా నామినేషన్లకు ఆఖరు రోజైన గురువారం(మే 19న) వెల్లడవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, CM KCR, Rajya Sabha, Telangana, Trs, Ysrcp