దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కంటే తెలంగాణ సీఎం కేసీఆరే సీనియర్ అని, ఏ విషయంలోనైనా గులాబీ బీసే గొప్పని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. బండి సంజయ్ నెత్తిన రూ.100 పెట్టినా ఒక్క రూపాయికీ ఎవరూ కొనబోరని ఎద్దేవా చేశారు..
దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కంటే తెలంగాణ సీఎం కేసీఆరే సీనియర్ అని, పట్టుదలతో రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా దానిని నంబర్ 1గా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దని, మోదీ మాత్రం దేశాన్ని సర్వనాశనం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, వివేకానందలు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీపై నిప్పులు చెరిగారు.
తెలంగాణలో బీజేపీ ఒక చెల్లని రూపాయి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కారును కూలుస్తామని పిచ్చికూతలు కూస్తే ఖబడ్ధార్ అని హెచ్చరించారు. బీజేపీ దొంగల పార్టీ అని, రాష్ట్రానికి కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ పాన్ ఇండియా పొలిటికల్ సూపర్‌స్టార్ అని జీవన్ కీర్తించారు. కేంద్రం ఏ వర్గానికి మేలు చేసిందో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
సొంత పాలనతో పచ్చగా మారిన తెలంగాణ వనరులపై బీజేపీ, ఈస్టిండియా కంపెనీ దేశాన్ని దోచుకున్నట్టు మోదీ ఆధ్వర్యంలోని నార్త్ ఇండియా కంపెనీ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిందంటూ జీవన్ రెడ్డి తీవ్ర పదజాలంతో కమలదళంపై విరుచుకుపడ్డారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ను రిసీవ్ చేసుకోలేదని, అలాంటిదిప్పుడు కేసీఆర్ ను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు.
రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై రాక్షసులు పడ్డట్టు బీజేపీ నేతలు దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ కంటే ముందే సీఎం కేసీఆర్ రాజకీయాల్లో వచ్చారని, ఆలెక్కన టీఆర్ఎస్ అధినేతే సీనియర్ అని చెప్పారు. తెలంగాణ సాధించి అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్న నాయకుడు మంత్రి కేటీఆర్ అని వెల్లడించారు.
కేంద్రం ఇస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనమని వివేకానంద చెప్పారు. వాస్తవాలు తెసుకోకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో పరిశ్రమలకు పవల్ హాలిడేలు ప్రకటించారని విమర్శించారు. తెలంగాణలో మాత్రం అన్ని రంగాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు. బండి సంజయ్ నెత్తిన రూ.100 పెట్టి ఒక్క రూపాయికి కొనమన్నా కరీంనగర్లో ఎవరూ తీసుకోరని ఎద్దేవా చేశారు. మోదీ ఎంపీగా ఉన్న వారణాసిలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. నాగార్జున సాగర్, హుజూర్నగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.