అకస్మాత్తుగా ఆకాశానికి చిల్లు పడినట్లు అసాధారణ వర్షం కురిసి, ఆ ప్రాంతంలో భారీ విపత్తుకు కారణమయ్యే క్లౌడ్ బరస్ట్ (Cloudburst) విలయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ కుట్రలు ఉండొచ్చన్న కేసీఆర్ వ్యాఖ్యలను పలువురు సమర్థిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నాయి. వరద ముంపులో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుట్ర థియరీని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ కామెంట్లు ఈ దశాబ్దపు బెస్ట్ జోక్ అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత, నటి విజయశాంతి (Vijayashanthi) మరో అడుగు ముందుకేసి.. అది క్లౌడ్ బరస్ట్ కాదు.. కేసీఆర్ మైండ్ బరస్ట్.. టీఆర్ఎస్ పాలన వరస్ట్ అంటూ నిప్పులు చెరిగారు.
భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని, బహుశా సీఎంకు మతి భ్రమించినట్లుందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనను చూసి జనం నవ్వుకుంటున్నారని, సీఎం పర్యటనతో బాధితులకు భరోసా కలగాలి, ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలే కానీ, ఈ సీఎం అక్కడికి వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయశాంతి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టారు.
‘గోదావరికి గతంలోనూ వరదలు వచ్చాయి. భవిష్యత్తులోనూ రావొచ్చు. కేసీఆర్ కు మాత్రం భారీ వర్షాలు మానవ సృష్టిలా కన్పిస్తోంది. పైగా విదేశాల కుట్రనట. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్. తానే పెద్ద ఇంజనీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయింది. మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప, కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేకచోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసింది’ అని విజయశాంతి ఆరోపించారు.
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారని, విదేశీ కుట్ర పేరుతో మరో డ్రామాకు తెరదీశారని విజయశాంతి మండిపడ్డారు. వారం రోజులుగా వరద ముంపుతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదని, జీతాలందక ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నరని, జీతాలివ్వడం చేతగాక, వర్షాల అంశాన్ని విదేశీ కుట్ర పేరుతో అంతర్జాతీయం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు కన్పిస్తోందని విమర్శించారు.
ముంపు బాధితుల కుటుంబాలకు కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేలు సరిపోవని, సీఎం పర్యటన గాలి పర్యటనలా మారిందని, గతంలో హైదరాబాద్ వరద ముంపు బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ ది అని బీజేపీ నేత అన్నారు. గత వారం రోజులుగా తెలంగాణలో వందలాది గ్రామాలు మంపుకు గురై వేలాది మంది నిరాశ్రయలవుతుంటే సీఎం మాత్రం వివిధ రాష్ట్రాల్లోనున్న ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతూ కేంద్రాన్ని బదనాం చేసేందుకు కుట్ర చేస్తుండటం సిగ్గు చేటని విజయశాంతి ఫైరయ్యారు. సీఎం కనీస సమయం వెచ్చిస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదనే ఆమె మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Telangana, Telangana rains, Trs, Vijayashanthi