తెలంగాణ(Telangana)ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS)జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ (KCR)69జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ ఉద్యమ సారధిగా విజయం సాధించారు. నాలుగు కోట్ల ప్రజల 62ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ జాతిపితగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలంగాణ ఏర్పాటుతో తన కల సాకారం అయిపోయిందని భావించకుండా బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ఉద్యమ సారధి నుంచి దేశ్ కీ నేతగా..
ఉద్యమ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చి 8ఏళ్లుగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాష్ట్ర సంక్షేమ సారధిగా తెలంగాణను, పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపనతో రాష్ట్ర రాజకీయాలో సువర్ణ అధ్యాయం లిఖించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసేందుకు, జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి ..దేశ్ కీ నేతగా మారారు. కేసీఆర్ 69వ జన్మదినం(Birthday) సందర్బంగా పార్టీ శ్రేణులు, ప్రజలు తెలంగాణ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గులాబీ దళపతికి జన్మదిన శుభాకాంక్షలు..
అసువులు బాసిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ముందుండి నడిపించి విజయతీరానికి చేర్చిన ఉద్యమ సారధి, బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండుగలా జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటుతో పాటు రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్న గులాబీ బాస్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పూజలు, అభిషేకాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పార్టీ శ్రేణులు, నేతలు, ప్రజలు. ముఖ్యంగా ఊరూరా, వాడ వాడలా గులాబీ దళపతి పేరుతో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్..
హైదరాబాద్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌లోని సంజీవయ్య పార్కు పక్కన ఉన్న థ్రిల్ సిటీలో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.ఉదయం 10గంటలకు మొదలయ్యే ఈ వేడుకల్లో స్పీకర్, మండలి చైర్మెన్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొననున్నారు. అలాగే శేరిలింగంపల్లిలో మెగా రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నారు.
ఇక కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేశ్ కీ కీ నేత అంటూ ఓ ప్రత్యేక వీడియో, ఆడియో గీతాన్ని రూపొందించారు. దీన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
ఊరూరా పండుగే..
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14ఏళ్లు ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్..చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారు. అందుకే ఆయన పుట్టిన రోజు సంబరాల్ని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒక రోజు ముందుగానే కేక్ కట్ చేసి ప్రారంభించారు మంత్రి హరీష్‌రావు. జయశంకర్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ టోర్నీ పేరుతో మూడో సీజన్ పోటీలను ప్రారంభించారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలతో పాటు వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం , నల్లగొండలో కేసీఆర్ పేరుతో సేవ కార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదానాలు నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana News