తెలంగాణ(Telangana)లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్(TRS)కి కేవలం కాంగ్రెస్(Congress)మాత్రమే ప్రత్యామ్నాయం అనుకుంటే ఈసారి బీజేపీ(BJP), వైఎస్‌ఆర్‌టీపీ(YSRTP) కూడా తోడయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ పోటీ మరింత రంజుగా మారింది. జిల్లాకు చెందిన మంత్రి, టీఆర్‌ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్‌కి, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలికి మధ్య డైలాగ్ వార్ కాస్తా సవాళ్ల వరకు చేరుకుంది. టీఆర్‌ఎస్ నేతలు, కేసీఆర్(KCR) ప్రభుత్వంపై వైఎస్ షర్మిల(YS Sharmila)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతుంటే ..అంతే ధీటుగా మంత్రి పువ్వాడ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఖమ్మం నుంచే షర్మిల పోటీ చేస్తారని మొదట్నుంచి ప్రచారం జరుగుతుంటే..ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేసిన ఓడిస్తానంటూ సవాల్ చేశారు మంత్రి. అంతే కాదు షర్మిల తనపై పోటీ చేసి గెలవంటూ పువ్వాడ అజయ్ (Puvvada Ajay)సవాల్ విసిరారు. 24గంటల క్రితం పువ్వాడ అజయ్ చేసిన కామెంట్స్‌కి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. మంత్రి పువ్వాడకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు.
మాటకు మాటే సమాధానం..
ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని గెలిపించుకునేందుకు ఫోకస్ పెట్టి వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. నేలకొండపల్లిలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు.అంతే కాదు పాలేరులో వైఎస్‌ఆర్‌టీపీకి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇకపై షర్మిల ఊరు కూడా పాలేరు అని అక్కడి నుంచే వైఎస్సార్‌టీపీని గెలిపించాలని షర్మిల కోరారు.
గెలుపు-ఓటములపై సవాళ్లు..
షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని పువ్వాడ అజయ్ సవాల్ చేసిన మరుసటి రోజే షర్మిల తాను పోటీ చేసే నియోజకవర్గం పేరు బయటపెట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంతే కాదు శుక్రవారం మంత్రి పువ్వాడ బయ్యారం గనుల్లో షర్మిలకు వాటా ఉందని చేసిన విమర్శలపై కూడా ఆమె స్పందించారు. బయ్యారం గనుల్లో తనకు ఎటువంటి వాట లేదని నా పిల్లలా మీద ప్రమాణం చేసి చెబుతానన్నారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కూడా తాను నీతిమంతుడని ఆయన పిల్లలపై ప్రమాణం చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు వైఎస్ షర్మిల. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓ కంత్రి మంత్రని .. అవినీతిపరుడని..భూకబ్జాదారుడని తీవ్రవిమర్శలు చేశారు. అలాంటి అవినీతిపరుడు వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తల జోలికి వస్తే పిచ్చికుక్కను కొట్టినట్లు కొడతారని ఘాటుగా కామెంట్స్ చేశారు.
హీటెక్కిన ఖమ్మం పాలిటిక్స్..
పార్టీల పరంగా మొదలైన ఈ పొలిటికల్ డైలాగ్ వార్ పర్సనల్ వార్‌గా మారిపోయింది. మంత్రిని పెద్ద అవినీతిపరుడని షర్మిల విమర్శిస్తే ..అక్రమాలు చేసిన చరిత్ర వైఎస్ షర్మిల ఫ్యామిలీది అంటూ పువ్వాడ మాటులు వదిలారు. అంతే కాదు సొంత అన్నతో పంచాయితీ పెట్టుకొని ఆంధ్రా నుంచి వచ్చిన షర్మిల తెలంగాణలో ఏం చేస్తుందంటూ కామెంట్ చేశారు మంత్రి. టీఆర్‌ఎస్ పార్టీని దెబ్బతీయడంతో పాటు మంత్రి పువ్వాడ సవాల్‌కి ధీటుగా బదులివ్వాలనే ఆలోచనలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే పాలేరు అసెంబ్లీతో పాటు ఖమ్మం లోక్‌సభ నుంచి కూడా షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఓడిస్తానన్న వాళ్ల మాటను తిప్పికొట్టాలనే ఆలోచనతోనే షర్మిల పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేస్తారనే టాక్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.
ఆ ధీమాతోనే పోటీకి సై ..
దివంగతనేత వైఎస్‌ఆర్ ఛరిష్మాను రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి .. ఎన్నికల్లో పోటీకి కాలు దువ్వుతున్నారు. పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. బంగారు తెలంగాణ కేవలం తనతోనే సాధ్యమని చెబుతున్న వైఎస్ షర్మిల ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, అధికార పార్టీ నేతలపై చేస్తున్న ఆరోపణలు తారస్థాయికి చేరడంతో రియాక్షన్ సవాళ్ల వరకు వెళ్లిందంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు. ఇప్పుడైతే ఓకే మరి ఎన్నికల్లో ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Puvvada Ajay Kumar, YS Sharmila