తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎక్కువగా ఫోకస్ చేసిందనే విషయం ఇటీవల ఆ పార్టీ ముఖ్యనేతల రాష్ట్ర పర్యటనలను బట్టి అర్థమవుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే బీజేపీ కీలక నేతలు తెలంగాణకు వచ్చి వెళ్లారు. ఇక్కడ అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ.. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ(BJP) శ్రేణుల్లో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం నింపుతున్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో త్వరలోనే తెలంగాణలో బీజేపీకి సంబంధించిన మరో కీలకమైన సమావేశం హైదరాబాద్‌లో(Hyderabad) జరగనుందని తెలుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై మొదటి వారంలో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఆ పార్టీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇందుకోసం హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ సెంటర్, నోవాటెల్ హోటల్ సహా పలు రిసార్టులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్ సహా పలువురు పరిశీలించినట్టు సమాచారం. ఈ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగితే.. బీజేపీకి చెందిన 29 రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యనేతలు హైదరాబాద్‌కు రానున్నారు. ఇక ప్రధాని మోదీ,(PM Modi) హోంమంత్రి అమిత్ షా,(Amit Shah) ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రెండు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి.
అందుకే ఇందుకోసం అనువైన ప్రాంతాలను గుర్తించే పనిలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశాల షెడ్యూల్ ఖరారైతే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల మూడో వారంలో బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర జరగాల్సి ఉంది. అయితే కీలకమైన ఈ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. బండి సంజయ్ పాదయాత్ర జులై రెండో వారానికి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Telangana| BJP: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. బీజేపీ నిర్ణయం రెండు రకాలుగా కలిసి రానుందా ?
T Congress: రేవంత్ ‘రెడ్డి’పై మళ్లీ చర్చ జరుగుతుందా ?.. మళ్లీ ఆయనే దిక్కవుతారా ?
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్న బీజేపీ.. జాతీయ కార్యవర్గ సమావేశాలను పెద్ద ఎత్తున నిర్వహించి తద్వారా రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్‌పై ఒత్తిడి పెంచాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి తెలంగాణపై సీరియస్‌గా ఫోకస్ చేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం.. జాతీయ కార్యవర్గ సమావేశాలతో మరోసారి రాష్ట్రంపై రాజకీయ దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.