బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Chief Bandi Sanjay) గురువారం సీఎం కేసీఆర్‌కు (CM KCR)) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారంపై టీఆర్ఎస్ (TRS) సర్కారు నిర్లక్ష్యం, రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం.. తదితర అంశాలను ఈ లేఖలో బండి ప్రస్తావించారు. రాష్ట్రంలో రైతుల కంట కన్నీరు ఒలుకుతుంటే.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మాత్రం పన్నీరు ఒలుకుతోందని బండి సంజయ్ సెటైర్లు వేశారు.
రుణాలకు వడ్డీల మీద వడ్డీలు..
2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రైతులకు రూ.1 లక్ష మేర రుణమాఫీని అమలు చేయాలని లేఖలో సంజయ్ డిమాండ్ చేశారు. ఈ రుణమాఫీ అమలు కాని నేపథ్యంలో రైతులు ఆ రుణాలకు వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇప్పటికే చితికిపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు రైతు బంధు నిధులను సకాలంలో విడుదల చేయకపోతే.. మరోమారు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి మరింత మేర అప్పుల్లో కూరుకుపోతారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రుణ మాఫీ, రైతు బంధు నిధుల విడుదలతో రైతులను ఆదుకోవాలని ఆయన సీఎం కేసీఆర్(CM KCR)ను విజ్ఞప్తి చేశారు.
హెల్త్ కార్డులు అందలేదు..
రైతుల సంక్షేమం కోసం కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ సర్కారు (Narendra modi) కృషి చేస్తోందని బండి సంజయ్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కిసాన్ సమ్మాన్ కింద (PM kisan samman nidhi) ఇచ్చే నిధులను మోదీ సర్కారు రైతుల ఖాతాల్లో జమ చేసిందని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల పొలాల్లో ఏ పంట వేస్తే బాగుంటుందన్న విషయాన్ని రైతులకు చెప్పేందుకు మోదీ సర్కారు దేశవ్యాప్తంగా సాయిల్ హెల్త్ కార్డులను మంజూరు చేసిందని బండి సంజయ్ వెల్లడించారు. అయితే కేసీఆర్ సర్కారు సహకారం లేని కారణంగా తెలంగాణ రైతాంగానికి ఇప్పటికీ సాయిల్ హెల్త్ కార్డులు అందలేదని ఫైరయ్యారు.రైతులకు పంటల పెట్టుబడి కింద కేసీఆర్ సర్కారు ప్రకటించిన రైతు బంధు పథకం నిధులు సకాలంలో విడుదల కాలేదని బండి సంజయ్ ఆరోపించారు.
పెట్టుబడికి డబ్బుల్లేక..
సకాలంలో అందని రైతు బంధు (Rythu bandhu) వల్ల లాభమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించిన విషయాన్ని గుర్తు చేసిన సంజయ్... చాలా మంది రైతులు దుక్కులు దున్ని విత్తనం వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పారు. అయితే పెట్టుబడికి డబ్బుల్లేక రైతు బంధు నిధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని బండి సంజయ్ వాపోయారు. ఈ పరిస్థితిని గమనించి తక్షణమే రైతు బంధు కింద విడుదల చేయాల్సిన రూ.7,500 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.