తెలంగాణలో పంచభూతాలనూ కల్వకుంట్ల కుటుంబం కబ్జా పెట్టిందని, రాష్ట్ర ప్రజలను నిలువునా దోచుకుంటున్నదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ అక్రమాలకు చెరగీతం పాడటానికే కేంద్ర మంత్రి అమిత్ షా విచ్చేశారని, మోదీ-షా నాయకత్వం, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశిస్సులతో తెలంగాణలో హిందూ రాజ్యస్థాపన జరుగుతుందని, అందుకోసం ప్రజలంతా దయచేసి బీజేపీకి ఓట్లు వేయాలని బండి సంజయ్ కోరారు. హైదరాబాద్ శివారు తుక్కుగూడ (మహేశ్వరం)లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు నేపథ్యంలోనే నేడు సభ జరగ్గా, బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తుక్కుగూడ సభలో సంజయ్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...
‘‘కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడో బయటపెట్టి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా నేను ప్రజాసంగ్రామ యాత్ర మొదలుపెట్టాను. ఆనాడు అమిత్ షా ఆదేశంతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో పాదయాత్ర చేపట్టాను. నడిచింది నేనే అయినా.. నడిపించింది కార్యకర్తలు, కేంద్రం పెద్దలే. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తున్నది. ప్రజల్ని కాపాడుకోవాలనే మేం తిరుగుతున్నాం. ప్రజలంతా కేసీఆర్ తో విసిగిపోయారు. తెలంగాణలో అంతటా జనం మోదీ-బీజేపీ అని నినదిస్తున్నారు.
కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఆర్ పంచభూతాలను కబ్జా చేసిన దుర్మార్గ పార్టీ. ధరణి పేరుతో ప్రజల భూములు దోచుకుంది. భూ, ఇసుక మాఫియాను నడుపుతున్నారు. హరితహారంలోనూ అవినీతే. శ్రీలంక ఒక కుటుంబం పాలన వల్ల ఎలా అధోగతి పాలైందో.. తెలంగాణలోనూ కల్వకుట్ల పాలన సాగుతోంది. తెలంగాణలో ఒక్కొక్కరి పేరున లక్షల అప్పు చేశాడు కేసీఆర్. శ్రీలంకలాగే చివరికి చిప్ప చేతిలో పెడతాడు. ప్రజలు బిచ్చగాళ్లు కావొద్దనే ఎన్నికలు రావాలని కోరుతున్నాం. నీటి ప్రాజెక్టుల విషయంలోనూ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు. వరి వేస్తే ఉరే అని రైతులను భయపెట్టి.. తాను మాత్రం వడ్లు పండించిండు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. ఇళ్లు లేని పేదలు అందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆ పనిచేస్తాం. అలాగే, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. ఫసల్ బీమా ద్వారా రైతులను ఆదుకుంటాం. మొదటి ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలు ఇచ్చాం. ఇప్పుడు ఈ హామీలు కలిపి మొత్తాన్ని చేసి చూపిస్తాం.
ఔరంగజేబు సమాధిపై మోకరిల్లిన మూర్ఖులకు తెలంగాణ గడ్డపై ఉండే హక్కులేదు. టీఆర్ఎస్-ఎంఐఎం-కాంగ్రెస్ పార్టీ మూడు ఒక్కటే. ఎవరికి ఓటేసినా ముగ్గురికి పోయినట్లే. కాంగ్రెస్ కు పోటీ ఇచ్చే సత్తా లేనేలేదు. గుంటనక్క పార్టీలన్నీ ఒక్కటిగా పోటీకి వస్తున్నాయి. అదే సింహం లాంటి బీజేపీ మాత్రం సింగిల్ గానే అందరినీ ఎదుర్కొంటుంది.
ఇప్పటికే మీరు కాంగ్రెస్, టీఆర్ఎస్ ల పాలన చూశారు. మేం ప్రజల్ని కోరుతున్నాం.. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి.. ప్లీజ్.. దయచేసి బీజేపీని ఒక్కసారి గెలిపించండి.. మా కార్యకర్తలు నాన్ బెయిలబుల్ కేసులు ఎదుర్కొంటున్నారు.. మిగతా పార్టీలు అన్నిటికీ అవకాశం ఇచ్చారు. ఈసారి దయ ఉంచి బీజేపీకి అవకాశం ఇవ్వండి.. తెలంగాణలో నరేంద్ర మోదీ పాలన తీసుకురండి..’’ అని బండి సంజయ్ అన్నారు.
అంతకుముందు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తుక్కుగూడ సభలో మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఏముఖం పెట్టుకొని వస్తారు? అంటారా? అంబేద్కర్ రాజ్యాంగ ఇచ్చిన హక్కు ప్రకారం ఎక్కడికైనా వెళతారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ కుటుంబం జాగీరా? ఇక్కడికి ఎవరూ రావొద్దా? 1200 మంది బలిదానాలు, మూడున్నర కోట్ల మంది పోరాటంతో తెలంగాణ వచ్చింది. అంతేగానీ కల్వకుంట్ల కుటుబం కోసం కాదు. కేసీఆర్ పర్మిషన్ తీసుకొని భారత హోం మంత్రి హైదరాబాద్ రావాలా? ఇది నిజాం రాజ్యమా? ఇక్కడ కూడా అంబేద్కర్ రాజ్యంగమేకదా నడిచేది. అందుకే కావొచ్చు కేసీఆర్.. రాజ్యాంగాన్ని మార్చేయాలని పదే పదే అంటున్నాడు. బీజేపీ బరాబర్ తెలంగాణలో తిరుగుతంది. గత ఏడున్నరేళ్లుగా మోదీ నేతృత్వంలోని కేంద్రం తెలంగాణకు ఎంతో చేసింది. అవన్నీ ప్రజలకు వివరించి, కేసీఆర్ పై పోరాడుతాం.
దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని 10 ఏళ్లయింది.. కనీసం ఇప్పటికైనా.. అఫ్ కోర్స్ టీఆర్ఎస్ గెలిచే టీఆర్ఎస్ కు లేదుగానీ దళితున్ని సీఎంగా ప్రకటిస్తారా? దళితబంధు ఇంకా గులాబీ జెండాల మద్యే తిరుగుతోంది. ప్రపంచమంతా నివ్వెరపోయే ప్రకటన అని రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని ఏళ్లయింది.. వాటి జాడే లేదు. తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ దక్కకపోవడానికి కారణం కల్వకుంట్ల కుటుంబమే. కానీ మోసపూరితంగా కేంద్రాన్ని దోషిగా చూపెడుతోంది. మజ్లిస్ పార్టీతో కుమ్మక్కయి మైనార్టీ రిజర్వేషన అంటూ గిరిజనులకు విస్మరిస్తోంది..’’అని కిషన్ రెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bandi sanjay, Bjp, Hyderabad, Telangana