హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP: ‘మునుగోడు’ తరువాత మారిన బీజేపీ ప్లాన్.. అలా జరిగితేనే మళ్లీ ఊపు ?

BJP: ‘మునుగోడు’ తరువాత మారిన బీజేపీ ప్లాన్.. అలా జరిగితేనే మళ్లీ ఊపు ?

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

BJP: మునుగోడు ఉప ఎన్నిక తరువాత మళ్లీ తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు రావాలంటే చేరికలు పెద్ద ఎత్తున ఉండాలని ఆ పార్టీ భావిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు ఉప ఎన్నిక తరువాత తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతాయనుకున్న బీజేపీ అంచనాలు అంతగా నిజం కాలేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాము గెలిస్తే.. ఇతర పార్టీలు, అందులోనూ టీఆర్ఎస్ నుంచి కూడా తమ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని బీజేపీ(BJP) లెక్కలు వేసుకుంది. ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో తుఫాను వస్తుందని భావించింది. కానీ మునుగోడులో(Munugodu) మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. ఓడిపోవడం బీజేపీకి ఒక రకంగా షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో టీఆర్ఎస్‌కు(TRS) ప్రత్యామ్నాయం తామే అనే విషయాన్ని మునుగోడు ఉప ఎన్నికల ద్వారా చాటి చెప్పామని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ... రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు దొరుకుతారా ? లేదా ? అనే సందేహాలు ఆ పార్టీకి మొదటి నుంచి ఉన్నాయి.

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే.. అన్ని నియోజకవర్గాల నుంచి బలమైన నేతలు తమ పార్టీకి క్యూ కడతారని భావించిన బీజేపీ .. ఇప్పుడు మళ్లీ బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి ఎక్కువగా నేతలు తమ పార్టీలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ నుంచి వలసలను ప్రాత్సహించాలని కమలం పార్టీ భావిస్తోందని సమాచారం. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నేతలపై బీజేపీ ఫోకస్ చేసిందని.. అలాంటి ఓ అరడజను మంది నేతలతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని సమాచారం.

అయితే మునుగోడు ఉప ఎన్నిక తరువాత మళ్లీ తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు రావాలంటే చేరికలు పెద్ద ఎత్తున ఉండాలని ఆ పార్టీ భావిస్తోంది. అది జరిగితేనే.. తెలంగాణలో బీజేపీ అనుకున్న స్థాయిలో బలపడుతోందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళతాయని యోచిస్తోంది. ఇందుకోసం చేరికలపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో బలహీనపడ్డ కాంగ్రెస్ పార్టీలోని బలమైన నేతలను తమ వైపు తిప్పుకుంటే.. టీఆర్ఎస్‌ను మెజార్టీ స్థానాల్లో ఎదుర్కోవడం సులువు అవుతుందని బీజేపీ భావిస్తోంది.

Telangana Congress: తెలంగాణలో జంపింగ్ రాజకీయాలు..ఢిల్లీకి కాంగ్రెస్ సీనియర్ నేత..బీజేపీలో చేరబోతున్నారా?

Telangana Holidays List 2023: వచ్చే ఏడాది తెలంగాణలో 28 సెలవులు.. సండే రోజు ఆ 3 పండుగలు.. పూర్తి లిస్ట్ ఇదే

ఇందుకోసం తమ పార్టీలోని ముఖ్యనేతలైన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ వంటి వారిని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ముందుగా బలమైన నాయకులను బీజేపీలోకి తీసుకురావడం ఎలా అనే అంశంపైనే బీజేపీ దృష్టి పెట్టిందని.. ఈ ప్రయత్నం ఫలిస్తే.. మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బలపడుతోందనే విషయం ప్రజల్లోకి గట్టిగా వెళుతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక తరువాత చేరికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన బీజేపీ.. ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

First published:

Tags: Bjp, Telangana

ఉత్తమ కథలు