టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్.. మళ్లీ ఆ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం బీజేపీలో చేరికలకు సంబంధించిన కమిటీకి ఈటల రాజేందర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈటల రాజేందర్(Etela Rajendar) వచ్చిన తరువాత తెలంగాణలో కొంతమేరకు చేరికలు పెరిగినా.. ఇప్పటికీ అవి ఆశించిన స్థాయిలో లేవనే వాదన ఉంది. అయితే ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక మీదే అందరి దృష్టి ఉండటంతో.. ఈ ఉప ఎన్నిక ఫలితాల ఆధారంగా బీజేపీలోకి వలసల ప్రవాహం ఉంటుందనే చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. అయితే పార్టీలో చేరికలను వేగవంతం చేసేందుకు ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారనే చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తాను కేసీఆర్(KCR) ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన ఈటల రాజేందర్.. కొద్దిరోజుల పాటు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే కొంతకాలంగా ఆయన గజ్వేల్‌లో పోటీ చేసే అంశంపై మాట్లాడటం లేదు. దీంతో గజ్వేల్‌లో(Gajwel) పోటీ చేసే విషయంలో ఈటల రాజేందర్ మనసు మార్చుకున్నారా ? లేక ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా ? అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఈటల రాజేందర్ ఈ రకమైన ప్రకటన చేసిన తరువాత బీజేపీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది.
ఈటల రాజేందర్‌కు గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు పార్టీ హైకమాండ్ అనుమతి ఇచ్చిందా ? లేక ఆయన సొంతంగానే ఈ ప్రకటన చేశారా ? అనే వాదనలు వినిపించాయి. అయితే పార్టీ నేతలు సొంతంగా తాము పోటీ చేసే స్థానంపై ప్రకటనలు చేసుకునే పద్ధతి బీజేపీలో ఉండదని.. అవన్నీ బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి లోబడే ఉంటాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ ఆ రకమైన వ్యాఖ్యలు చేసిన తరువాత ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేసే అంశంపై ప్రకటనలు చేయడం మానేశారని కొందరు చర్చించుకుంటున్నారు. కొందరైతే ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేసే అంశంపై వెనక్కి తగ్గారని అనుకుంటున్నారు.
Telangana politics: తెలంగాణ అధికార పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లు .. పదవులు పోయె గుర్తింపు కరువాయె
TSRTC: ఆదాయం లేదంటూ ఆర్టీసీ సర్వీసు బంద్.. ఇదెక్కడి న్యాయం అంటూ విద్యార్థుల ఆందోళన
ఈటల రాజేందర్‌కు బీజేపీ సంస్కృతి అలవాటు కావడానికి కొంత సమయం పట్టిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈటల రాజేందర్ సన్నిహితులు మాత్రం గజ్వేల్‌లో పోటీ చేసే విషయంలో ఈటల రాజేందర్ ఇంకా అదే రకమైన పట్టుదలతో ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు ఆయన ఈ అంశంపై పార్టీ పెద్దలను ఒప్పించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. మొత్తానికి గజ్వేల్‌లో తాను పోటీ చేస్తానంటూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టించిన ఈటల రాజేందర్.. మళ్లీ ఈ అంశంపై సైలెంట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Etela rajender, Gajwel, Telangana